Site icon NTV Telugu

Musharraf: ఆరోగ్య పరిస్థితి విషమం.. ఎయిర్ అంబులెన్స్‌లో పాకిస్థాన్‌కు..!

Mushraf

Mushraf

ప్రస్తుతం యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లో చికిత్స పొందుతున్న పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ప‌ర్వేజ్ ముషార‌ఫ్‌ను ఎయిర్ అంబులెన్స్‌లో పాకిస్థాన్‌కు త‌ర‌లించే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నట్లు స‌మాచారం. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, ఆయ‌న కోలుకోవ‌డం అసాధ్యంగా మారింద‌ని కుటుంబ స‌భ్యులు చెప్పారు. దీంతో ఆయ‌న‌ను స్వదేశానికి త‌ర‌లించేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌ని తెలిసింది. ముషార‌ఫ్ ఫ్యామిలీ కోరుకుంటే స్వ‌దేశానికి ఆయ‌న‌ను త‌ర‌లించేందుకు వీలు క‌ల్పిస్తామ‌రి పాక్ సైన్యం పేర్కొన్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి.అలాగే ‘కుటుంబ సభ్యుల అంగీకారం, వైద్యుల సలహా మీదట ఆయన్ను పాకిస్థాన్‌కు తిరిగి వచ్చేందుకు అన్ని ఏర్పాటు జరుగుతున్నాయి. పాక్ ఆర్మీ తన మాజీ చీఫ్‌కు అండగా నిలుస్తోంది. తన ఏర్పాట్లలో భాగంగా ఎయిర్ అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచిందని” ఓ ప్రముఖ టీవీ యాంకర్ ట్వీట్ చేశారు.

గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ముషారఫ్ గత మూడు వారాలుగా యూఏఈలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఇటీవల కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్‌పై లేరని.. ఆయన ఆరోగ్య పరిస్థితి కోలుకోవడానికి సాధ్యం కానంత క్లిష్టంగా మారిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయనకు అవయవాలు పనిచేయడంలేదన్నారు. ముషారఫ్‌ కోసం ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ముషారఫ్‌ వయస్సు 78 ఏళ్లు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన సైన్యంలో చేరి అంచెలంచెలుగా దేశాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2001 నుంచి 2008వరకు పాకిస్థాన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు.

Exit mobile version