Iran: ఇరాన్‌లో మూడేళ్ల తర్వాత మరోసారి భారీ స్థాయిలో ‘‘ఇస్లామిక్ పాలన’’కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. 2022-23లో మహ్సా అమిని హిజాబ్ వేసుకోలేదని అక్కడి మెరాలిటీ పోలీసులు తీవ్రంగా దాడి చేశారు. ఆ తర్వాత ఆమె చనిపోయింది. అప్పుడు, అక్కడి యువత, మహిళలు పెద్ద ఎత్తున హిజాబ్ వ్యతిరేక ఆందోళలు చేశారు. మూడేళ్ల తర్వాత మరోసారి ఇరాన్‌లో అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు.
ఆర్థిక సంక్షోభమే కారణం:
ఇనార్ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వేలాది మంది రోడ్లపైకి వచ్చి ‘‘ముల్లాలు వెళ్లిపోవాలి’’, ‘‘నియంత చావాలి’’ అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనల్లో భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఇరాన్ కరెన్సీ రియాల్ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే అత్యల్ప స్థాయికి పడిపోయింది. దీంతో ద్రవ్యోల్బణం 42 శాతానికి చేరింది. ప్రజలకు ఆహారం, మందులు, నిత్యావసరాలు దొరకడమే గగనమైపోయింది. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర నిరాశ, అసహనం వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యాపారులు, చిన్న దుకాణదారులు, ఉద్యోగులు పెద్దా ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు.
అయతొల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని మతపాలనకు వ్యతిరేకంగా ఈ నిరసనలు మారుతున్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రారంభమైన ఆందోళనలు, క్రమంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలుగా మారాయి. గ్రాండ్ బజార్ ప్రాంతంలో నిరసనకారులు ‘‘భయపడొద్దు, మనమంతా ఒక్కటే’’ అనే నినాదాలు చేశారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ నిరసనల్ని కేవలం ఆర్థిక సమస్యలకు పరిమితమైనవిగా చూపించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, భద్రతా దళాలు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ వాడటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తో్ంది.
ట్రంప్ నిర్ణయాలే ఇరాన్‌కు శాపమయ్యాయా.?:
అయితే, ఇరాన్ పరిస్థితికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమయ్యారు. ట్రంప్ హయాంలో అమెరికా 2015 అణు ఒప్పందం నుంచి వైదొలిగింది. ట్రంప్ తీవ్ర ఒత్తిడి కారణంగా ఇరాన్‌పై కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. చమురు ఆదాయం తగ్గి, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. 2025లో ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇరాన్‌పై మరింత ఒత్తిడి పెరిగింది. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయిల్, అమెరికా రెండూ దాడులు చేశాయి.
