Muhammad Yunus: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ మాజీ ప్రధాన సలహాదారు డాక్టర్ మహమ్మద్ యూనస్‌కు అమెరికాలో నిరసన సెగ తగిలింది. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ (JFK) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనను బంగ్లాదేశ్ ప్రవాసులు నిలదీశారు. యూనస్‌ను ఉద్దేశించి కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ‘నువ్వు టెర్రరిస్టువి.. బంగ్లాదేశ్‌లో ప్రజలను చంపావు.. ఇక్కడికి ఎందుకు వచ్చావు?’ అంటూ ప్రశ్నించినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది..
‘గో బ్యాక్’ అంటూ నినాదాలు
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో దోహా నుంచి వచ్చిన యూనస్.. టెర్మినల్ 8 నుంచి బయటకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం సుమారు 3.45 గంటల సమయంలో ఆయనను కొందరు ప్రవాసులు చుట్టుముట్టి నిరసన తెలిపారు. బంగ్లాదేశ్‌లో వందలాది మంది మరణాలకు, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడానికి యూనస్ కారణమంటూ ఆరోపణలు చేశారు. ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో యూనస్‌ను వీల్‌చైర్‌లో తిరిగి టెర్మినల్ లోపలికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.. ఇక, ఈ సమయంలో యూనస్ వెంట తాత్కాలిక ప్రభుత్వంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDGs) ప్రధాన సమన్వయకర్తగా పనిచేసిన, యూనస్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లామియా మోర్షెద్ ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది..
యూనస్‌కు నోబెల్ బహుమతి వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్
మరోవైపు, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, మతపరమైన ప్రదేశాలపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో భారత్‌లోనూ యూనస్‌పై నిరసనలు వ్యక్తమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ‘డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్’ (DHR) ఆధ్వర్యంలో పలు సామాజిక సంస్థల ప్రతినిధులు ఆందోళన నిర్వహించారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన 2024 ఆగస్టు 8 నుంచి హిందువులు, వారి ప్రార్థనా స్థలాలపై దాడులు కొనసాగుతున్నాయని DHR కన్వీనర్ అజయ్ శ్రీవాస్తవ ఆరోపించారు. ఈ ఆరోపణలపై అంతర్జాతీయ న్యాయస్థానంలో యూనస్‌పై కేసు నమోదు చేయాలని, 2006లో ఆయనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని వెనక్కి తీసుకునే అంశాన్ని నోబెల్ కమిటీ పరిశీలించాలని డిమాండ్ చేశారు.

