NTV Telugu Site icon

Mpox: కాంగోలో ఎంపాక్స్ విధ్వంసం, 570 దాటిన మరణాలు.. వ్యాక్సిన్ కోసం ఎదురుచూపులు..

Mpox

Mpox

Mpox: ప్రపంచాన్ని ఎంపాక్స్ కలవరపెడుతోంది. ఆఫ్రికా దేశం డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ వైరస్ విజృంభిస్తోంది. ఆ దేశంలోని అన్ని ప్రావిన్సుల్లో వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 16వేలకు పైగా కేసులు రాగా, వ్యాధి బారినపడి 570 మంది మరణించారు. మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది కొద్ది రోజుల్లోనే 16,000 కేసులు వచ్చాయిని, మరణాల సంకఖ్య 570 కన్నా ఎక్కువగా ఉన్నాయని ఆ దేశ ఆరోగ్య మంత్రి శామ్యూల్ రోజర్ కంబా తెలిపారు.

Read Also: Earthquake: జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. 4.9 తీవ్రత నమోదు..

ఇప్పటికే ఈ ఎంపాక్స్‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ‘‘గ్లోబల్ పబ్లిక్ హెల్త్‌కేర్ ఎమర్జెన్సీ’’గా ప్రకటించింది. ఈ వ్యాధికి ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. డీఆర్ కాంగోలోనే కాకుండా పక్క దేశాలైన బురుండి, కెన్యా, రువాండా మరియు ఉగాండాలో జూలై నుండి వ్యాధి వ్యాప్తి చెందింది. ఇదిలా ఉంటే యూరప్‌లోని స్వీడన్‌లో తొలి కేసు నమోదైంది. పాకిస్తాన్, ఫిలిప్పీన్స్‌లో కూడా కేసులు బయటపడ్డాయి.

ఆఫ్రికా పేద దేశాల్లో ఈ వ్యాధి విస్తరిస్తుండటంతో ఆయా దేశాలు వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. అమెరికా కాంగో కోసం 50,000 వ్యాక్సిన్ డోసుల్ని పంపుతామని హామీ ఇచ్చింది. జపాన్ 3.5 మిలియన్ డోసులు ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. కాంగోలో 3.5 మిలియన్ల పిల్లలతో సహా 4 మిలియన్ల మందికి టీకాలు వేయాలని యోచిస్తోంది. ఎంపాక్స్ దశాబ్ధాలుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం వస్తున్న వైరస్ రకం మరింత ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా ఉందని, క్లాడ్ 1b వైరస్ రకం 3.6 శాతం కేసుల్లో మరణాలకు కారణమవుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.