Israel-Hamas War: లెబనాన్‌పై ఒక వేళ ఇజ్రాయిల్ దాడి చేస్తే ‘‘మూర్ఖపు తప్పిదం’’ అవుతుందని హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా శుక్రవారం హెచ్చరించారు. మీరు లెబనాన్ పై ముందస్తు దాడి చేయాలని అనుకుంటే, అది మీ మొత్తం ఉనికిలో మీరు చేసే అత్యంత మూర్ఖపు తప్పు అవుతుందని ఉగ్రవాద సంస్థ చీఫ్ అన్నారు. గాజాలో ఇజ్రాయిల్ పై హమాస్ విజయం ఇరాన్, ముస్లిం బ్రదర్‌హుడ్‌ది మాత్రమే కాదని, ఇది ముందుగా పాలస్తీనియన్ల దేశభక్తి విజయమని, దీంతో పాటు ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, లెబనాన్‌లది విజయమని, కాబట్టి హమాస్ కి మద్దతు ఇవ్వడం మా కర్తవ్యం అని నస్రల్లా అన్నారు.
ఇజ్రాయిల్ టైమ్స్ ప్రకారం.. ఇజ్రాయిల్ కి చమురు ఎగుమతులు నిలిపేయాలని అరబ్ దేశాలను హిజ్బుల్లా చీఫ్ కోరాడు. ఇజ్రాయిల్-లెబనాన్ సరిహద్దుల్లో హిజ్బుల్లా సైనిక చర్యల్ని ప్రశ్నించారు. తాము ఇజ్రాయిల్‌పై చేసిన దాడి హమాస్‌పై యుద్ధం నుంచి దూరం చేసిందని ప్రగల్భాలు పలికాడు. ఇది అంతం కాదని ఇజ్రాయిల్‌ని హెచ్చరించే ప్రయత్నం చేశాడు. కొందరు హిజ్బుల్లా పోరాటంలో చేరబోతున్నారని అన్నారు. అక్టోబర్ 8 నుంచి ఈ యుద్ధంలో హిజ్బుల్లా ఉందని నస్రల్లా చెప్పాడు. ప్రతీరోజూ ఇజ్రాయిల్ సైనికులు, ట్యాంకులు, డ్రోన్లు, సెన్సార్లులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని, ఇప్పటి వరకు హిజ్బుల్లాకు చెందిన 57 మంది అమరులయ్యారని అతను చెప్పాడు.
మరోవైపు హిజ్బుల్లా ఏదైనా చర్యలకు పాల్పడితే, లెబనాన్ లోని ప్రజల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఇజ్రాయిల్ హెచ్చరించింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్ పై దాడులు చేసింది. 1400 మందిని క్రూరంగా చంపేసింది. ఆ తర్వాత నుంచి గాజాస్ట్రిప్ లోని హమాస్ ఉగ్రవాద స్థావరాలపై ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ దాడుల్లో 9000కు పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి హమాస్ కి మద్దతుగా లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంపై హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు.