ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ దాడుల్లో హతం అయ్యాక.. ఆయన కుమారుడు మోజ్తాబా కొత్త సుప్రం లీడర్‌గా నియమితులయ్యారు. కానీ ఇప్పటి వరకు బహిరంగంగా కనిపించలేదు. దీంతో మోజ్తాబా పరిస్థితి కూడా సీరియస్‌గా ఉందని.. రష్యాలో చికిత్స అందిస్తున్నారని రకరకాలైన ఊహాగానాలు వినిపించాయి. ఇంతలోనే మోజ్తాబా ఆచూకీ చెబితే రూ.94 కోట్ల రివార్డ్ ఇస్తామని అగ్ర రాజ్యం అమెరికా ప్రకటించింది. ఇక మోజ్తాబాను కూడా చంపేస్తామంటూ ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది.
ఇలాంటి ఊహాగానాల మధ్య తాజాగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ (IRIB) సంస్థ మొజ్తబా ఖమేనీకి సంబంధించిన ఒక అరుదైన వీడియోను విడుదల చేసింది. ఒక హాల్‌లో నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నట్లుగా మోజ్తాబా కనిపించారు. అయితే ఈ వీడియో తాజా వీడియోనేనా? లేదంటే పాత వీడియోనో క్లారిటీ లేదు. ఈ వీడియోలో మాత్రం మోజ్తాబా బాగానే ఉన్నట్లుగా కనిపించారు.
ఒక మత ప్రబోధ కార్యక్రమంలో మోజ్తాబా కనిపించారు. అయితే వీడియోను బట్టి చూస్తుంటే ఫుటేజ్ పాతదిగా కనిపిస్తోంది. సుప్రీం లీడర్‌గా నియమించిన దగ్గర నుంచి మోజ్తాబా ఖమేనీకి సంబంధించిన ఏ బహిరంగ వీడియో కూడా విడుదల కాలేదు. అయితే మోజ్తాబా ఆరోగ్యంపై రకరకాలైన వదంతులు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.
ఫిబ్రవరి 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వంలోని అనేక మంది కీలక నేతలు కూడా చనిపోయారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేయడంతో ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్, చమురు సంక్షోభం తలెత్తింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో భీకర స్థాయిలో యుద్ధం జరుగుతోంది.
