Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..

  • లండన్‌లో ఇరాన్ సుప్రీంలీడర్‌కు లగ్జరీ అపార్ట్మెంట్లు..
  • ఇజ్రాయిల్ రాయబార కార్యాలయానికి సమీపంలో ఉన్నాయంటూ వార్తలు..
  • వార్తల్ని తీవ్రంగా ఖండించిన ఇరాన్, మొజ్తబాకు ఎలాంటి ప్రావర్టీలు లేవని క్లారిటీ..
Khamenei

Khamenei

Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీకి లండన్‌లోని ఇజ్రాయిల్ ఎంబసీకి సమీపంలో రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్లు ఉన్నాయంటూ బ్రిటిష్ మీడియాలో వచ్చిన కథనాలను ఇరాన్ ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఖండించింది. భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మొజ్తబా ఖమేనీకి ఇరాన్‌లో కానీ, ఇతర విదేశాల్లో కానీ ఎలాంటి ఆస్తులు లేవని ఇరాన్ స్పష్టం చేసింది. ఆయన తన తండ్రిలాగే నిరాడంబరమైన జీవనశైలిని కొనసాగిస్తున్నారని పేర్కొంది. ఈ ఆరోపనణల ద్వారా ఆయన వ్యక్తిగత జీవితం, ప్రతిష్టంపై తప్పుడు కథనాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇరాన్ ఆరోపించింది.

బ్రిటిష్ మీడియా కథనాల ప్రకారం.. లండన్‌లోని కెన్సింగ్టన్‌లో పాలెన్ గ్రీన్ ప్రాంతంలో ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం ఉన్న వీధిలోనే రెండు విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు ఉన్నట్లు నివేదించాయి. 2014, 2016లో మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేసినట్లు, వాటిలో ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీకి సంబంధాలు ఉన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ రెండు ప్రాపర్టీల విషయంలో ఇరాన్‌కు చెందిన బ్యాంకర్ అలీ అన్సారీ పేరు వెలుగులోకి వచ్చింది. బ్రిటన్, అమెరికా ఆంక్షలు ఉన్న అన్సారీ ఈ ప్రాపర్టీలకు ఆర్థిక మధ్యవర్తిగా వ్యవహరించారని అమెరికా ఆరోపణలు చేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే, అన్సారీ-ఖమేనీ మధ్య ఆస్తుల సంబంధాన్ని ఇరాన్ ఖండించింది. ఈ రెండు అపార్ట్మెంట్లు ఇజ్రాయిల్ రాయబార కార్యాలయానికి సమీపంలో ఉండటంతో ఈ వార్తకు ప్రాధాన్యత ఏర్పడింది. లండన్‌లో ఇరాన్‌కు చెందిన నలుగురు వ్యక్తులను యూదు కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు, ప్రదేశాలపై నిఘా పెట్టిన ఆరోపణలపై అరెస్ట్ చేశారు. దీని తర్వాత ఖమేనీ వార్త రావడం చర్చనీయాంశంగా మారింది.