NTV Telugu Site icon

తాలిబన్ల చేతిలో అధునాతన ఆయుధాలు…

వెనక్కి వెళ్ళే హడావుడిలో అమెరికా పెద్ద తప్పే చేసింది. తన ఆయుధ డంపులను అఫ్గాన్‌లోనే వదిలేసింది. ఈ నిర్లక్ష్యం తాలిబన్లకు వరంగా మారింది. సుల్తాన్‌ఖిల్‌ సైనిక స్థావరంలోని కంటైనర్ల కొద్దీ ఆయుధాలు, వాహనాలు తాలిబన్ల సొంతమయ్యాయి.

అప్ఘాన్ సేన కోసం అమెరికా ఇరవైఏళ్లుగా అనేక ఆధునాతన ఆయుధాలను భారీగా సమకూర్చింది. అమెరికా భాగస్వామ్యంలో అందించిన బోలెడు ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు, ఎన్నో సైనిక మౌలిక వసతులు తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఇంతకాలం అందని వైమానిక సంపత్తి కూడా సొంతమయింది.

ఏసీ-208 విమానాలు తాలిబ‌న్ల చేతికి అందాయి. వీటిని వినియోగించ‌డం తాలిబ‌న్లు నేర్చుకుంటే ప‌రిస్థితి ఏంటని అమెరికా ఆందోళ‌న చెందుతోంది.

అయితే, తాలిబన్ల ఆధీనంలో హెలికాప్టర్లు, విమానాలు ఉన్నా, వాటి నిర్వహణ అంత తేలికైన విషయం కూడా కాదు. పైగా ఇవి తరచు బ్రేక్‌ డౌన్‌ అవుతుంటాయి. వాటిని బాగుచేయటం కూడా క్లిష్టమైన పనే. దానికి పక్కా ట్రెయినింగ్‌ ఉండాలి. ఇది కాస్త ఊరటనిచ్చే విషయం. కానీ, నైట్‌ విజన్‌ గాగుల్స్‌ మాత్రం తాలిబన్లు పూర్తి స్థాయిలోవాడుకునే అవకాశం ఉంది. వీటి వినియోగానికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. ఇవి దాడుల సమయంలో చాలా కీలకంగా మారతాయి. నైట్‌ విజన్‌ గాగుల్స్‌ ఉన్న సైనికుడికి, లేని సైనికుడికి చాలా తేడా ఉంటుంది.

ఇంత భారీ సంఖ్యలో చేజిక్కిన ఆయుధాలతో తాలిబన్లు ఏం చేసే అవకాశం ఉందనేదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ ఆయుధాలతో పౌరులను చంపడానికి లేదా, అమెరికాకు నష్టం కలిగించేలా ఉపయోగించటానికి ఉపయోగించవచ్చని ఆందోళన చెందుతున్నారు. హెలికాప్టర్లతో తాలిబన్లు వైమానిక దాడులకు తెగబడితే పరిస్థితేమిటనే ఆందోళన ఏర్పడుతోంది.