Millionaires migration: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి మిలియనీర్లు వలస వెళ్తున్నారు. పెట్టుబడి ద్వారా నివాసం, పౌరసత్వం వంటి అంశాలను అధ్యయనం చేసే ప్రపంచ కన్సల్టెన్సీ దిగ్గజం హెన్లీ అండ్ పార్టనర్స్ నివేదిక ప్రకారం.. 2025లో 1,42,000 మంది మిలియనీర్లు కొత్త దేశానికి వలస వెళ్లే అవకాశం ఉందని చెప్పింది. “హై నెట్ వెల్త్ కలిగిన వ్యక్తులు(HNWIs)” అంటే, 1 మిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ లిక్విడ్ ఆస్తులు కలిగిన వారు. వీరు 2026 నాటికి 1,65,000 మంది సొంత దేశాలను వదిలి వేరే దేశాలకు వలస వెళ్తారని హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2025 తెలిపింది.
ఈ ఏడాది 9800 మంది మిలియనీర్లు తమ కొత్త గమ్యస్థానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ని ఎంచుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బిలియనీర్ల వలసలకు యూఏఈ కేరాఫ్‌గా ఉంది. యూఎస్, ఇటలీ, స్విట్జర్లాండ్, సౌదీ అరేబియాలకు కూడా మిలియనీర్లను ఆకర్షించే దేశాల జాబితాలో ఉన్నాయి. నివేదిక ప్రకారం, యూకే నుంచి అత్యధికంగా ‘‘అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు’’ వేరే దేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Vijay Anthony : తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం పెరిగింది.. హీరో విజయ్ కామెంట్స్..
యూఏఈ ఎక్కువగా సంపన్న వ్యక్తులు కోరుకునే గమ్యస్థానంగా ఉంది. గతేడాది 6700 మంది నుంచి 2025 నాటికి ఈ వలసరలు 9800 మందికి చేరుతాయని, వీరంతా ఆ దేశంలో నివాసహోదా పొందుతారని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మిలియనీర్ల రాకలో అమెరికా రెండో స్థానంలో ఉంటుందని, 7500 మంది కొత్త మిలియనీర్లను అమెరికా ఆకర్షిస్తుందని అంచనా వేయగా, మూడోస్థానంలో ఇటలీ, నాలుగో స్థానంలో స్విట్జర్లాండ్ ఉంటుందని అంచనా. మరోవైపు, సౌదీ అరేబియా కూడా వేగంగా వృద్ధి సాధిస్తోంది. 2025 నాటికి 2400 మందికి పైగా కుబేరులు ఆ దేశానికి వెళ్లే అవకాశం ఉంది. ఇది గతేడాదితో పోలిస్తే 8 రెట్లు అధికం.
యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ఒకే ఏడాదిలో అతిపెద్ద సంపద వలసల్ని ఎదుర్కొంటోంది. 16,500 మంది HNWIలు వేరే దేశంలో నివాస హోదాను పొందుతారని అంచనా. సంపద వలసలో చైనా రెండో స్థానంలో అతిపెద్ద నష్టాన్ని ఎదుర్కొంటోంది. డ్రాగన్ దేశం నుంచి 7800 మంది మరొక దేశంలో నివాస హోదా పొందే అవకాశం ఉంది. ఆసియాలో దక్షిణ కొరియా నుంచి 2400 మంది మిలియనీర్లు బయట దేశాలకు వెళ్తున్నారు. ఇక ఇండియా నుంచి 3500 మంది మిలియనీర్లు బయటకు వెళ్తున్నారు. యూరప్‌లో అగ్రగామి దేశాలైన ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీలు 2025లో అధిక నష్టాన్ని చవిచూస్తాయని అంచనా వేయబడింది. ఐర్లాండ్, నార్వే, స్వీడన్ నుంచి కూడా అధిక సంపద కలిగిన వారు నిష్క్రమిస్తున్నారు.
వలసల్ని స్వాగతించే విధానం, జీరో ఆదాయపు పన్ను, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, రాజకీయ స్థిరత్వం యూఏఈని వలసలకు కేరాఫ్‌గా మార్చుతోంది. 2019లో ప్రవేశపెట్టబడిన, అర్హతను విస్తరించడానికి 2022లో సవరించబడిన UAE గోల్డెన్ వీసా కార్యక్రమం 5 లేదా 10 సంవత్సరాల వరకు చెల్లుబాటు అయ్యే దీర్ఘకాలిక, రిన్యూవల్ నివాస వీసాను అందిస్తుంది.
