NTV Telugu Site icon

Microsoft Layoffs: 10,000 మంది ఉద్యోగాలు ఊస్ట్.. ప్రకటించిన మైక్రోసాఫ్ట్

Microsoft

Microsoft

Microsoft Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం భయాలు టెక్ దిగ్గజాలను భయపెడుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ జాబితాలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా చేరింది. 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ బుధవారం ప్రకటించింది. 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ముగిసే నాటికి 10 వేల మందిని తొలగించనున్నట్లు వెల్లడించింది. ఈ తొలగింపు వల్ల ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 1.2 బిలియన్ డాలర్ల ఖర్చులను భరించాల్సి వస్తుందని.. ఇది ఒక్కో షేరు లాభంపై 12 సెంట్ల ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

Read Also: Microsoft Layoffs: భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న మైక్రోసాఫ్ట్.. నేటి నుంచే ఉద్వాసన

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సంస్థకు 2,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. గతేడాది అక్టోబర్ నెలలో 1000 మందిని మైక్రోసాఫ్ట్ తొలగించింది. మహమ్మారి విజృంభణ తర్వాత పర్సనల్ పీసీ మార్కెట్ లో మైక్రోసాఫ్ట్ తిరోగమనాన్ని ఎదుర్కొంటోంది. విండోస్, సాఫ్ట్వేర్లకు తక్కువ డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో అన్ని కంపెనీలు చేసిన విధంగానే మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది.

ఇప్పటికే అమెజాన్ 18,000 మందిని తొలగించనున్నట్లు తెలిపింది. మెటా తన వర్క్ ఫోర్స్ లో 13 శాతం అంటే దాదాపుగా 11,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ట్విట్టర్ ఏకంగా 50 శాతం మందిని తొలగించింది. ఆర్థికమాంద్యం భయాల వల్ల పలు అమెరికా కంపెనీలు ఇప్పటికే వేలల్లో ఉద్యోగులను ఇంటికి పంపించింది. ఇదిలా ఉంటే రాబోయే కొన్ని నెలల్లో ఈ ప్రభావం దేశీయంగా కూడా పడుతుందని అంచానా వేస్తున్నారు.