Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ని కలవడం, సింహం బోనులోకి వెళ్లడం దాదాపుగా ఒకటే. ఒక్క చిన్న తప్పు చాలు ప్రాణాలు పోవడానికి. కిమ్‌ను కలవడం సాధారణ దేశాధినేతల్ని కలవడం లాంటిది కాదని ఆ దేశ మాజీ దౌత్యవేత్త లీ ఇల్-గ్యు తెలిపారు. కిమ్ కలిసే వ్యక్తులకు దాదాపు నెల రోజుల పాటు కఠిన శిక్షణ ఉంటుందని వెల్లడించారు. కిమ్‌ను కలిసినప్పుడు ఎలా మాట్లాడాలి, మన హావభావాలు ఎలా ఉండాలి.?, ఆయనతో ఎలా ప్రవర్తించాలి? అనేది ప్రతీది పక్కాగా ఉండాలని చెప్పారు. తాను కిమ్‌ను 7 సార్లు కలిశానని, కలిసే ముందు శిక్షణ తీసుకున్నానని వెల్లడించారు.
అడిగితేనే మాట్లాడాలి, అతిగా ప్రవర్తించొద్దు..
ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అయిన లీ ఇల్-గ్యు.. తాను కిమ్ జోంగ్ ఉన్‌ను ఏడుసార్లు కలిసినట్లు తెలిపారు. కిమ్ సమక్షంలో చిన్న పొరపాటు కూడా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఆయన చెప్పారు. కిమ్ స్వయంగా ప్రశ్న అడిగితే తప్పా అవతలి వ్యక్తి మాట్లాడొద్దు. అడిగిన ప్రశ్నకు సంక్షిప్తంగా సమాధానం ఇవ్వాలి. జవాబు తెలియకున్నా తెలిసినట్లు ప్రవర్తించినా, నాకే తెలుసు అనే రీతిలో ప్రవర్తించినా తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన వెల్లడించారు. కిమ్ చుట్టూ ప్రతీది రికార్డ్ అవుతుందని తెలిపారు.
కిమ్‌ను కలిసేందుకు శిక్షణ..
కిమ్ ముందు అనవసరంగా కదలడం, హావభావాలు ప్రదర్శించడం కూడా తప్పే అని లీ చెప్పారు. కిమ్ దగ్గరగా వస్తే కంగారు పడటం, పారిపోవడం చేయొద్దని, ప్రశాంతంగా పక్కకు తప్పుకోవాలని శిక్షణలో చెబుతారని వెల్లడించారు. కిమ్‌ను ఆకట్టుకోవడానికి పొగడ్తలు చేయొద్దని, ఆయన దృష్టిని ఆకర్షించేలా ప్రయత్నించొద్దని హెచ్చరించారు. కిమ్‌తో తన తొలి భేటీని గుర్తు చేసుకుంటూ.. ఎయిర్ పోర్టు వీఐపీ వెయిటింగ్ రూమ్‌లో కిమ్‌ను తాను మొదటిసారి కలిసినప్పుడు తీవ్ర ఒత్తిడికి గురయ్యానని, తన గొంతు వణికిందని చెప్పారు.
ట్రాన్స్‌లేటర్ చిన్న తప్పు, ప్రాణాలు పోయే దాకా వచ్చింది..
కిమ్ సమావేశంలో ఒక అనువాదకుడు చేసిన పొరపాటు అతడి ప్రాణాలు పోయే వరకు వచ్చిందని లీ ఇల్ గ్యు చెప్పారు. 60 ఏళ్లు ఉన్న ట్రాన్స్‌లేటర్ కిమ్ మాట్లాడుతున్న సమయంలో మధ్యలో జోక్యం చేసుకున్నాడని, దీంతో కిమ్ ఆగ్రహించినట్లు చెప్పారు. ఆ అనువాదకుడిని మర్యాద లేని వ్యక్తిగా కిమ్ అభివర్నించారని, ఆ తర్వాత కార్యక్రమాలకు అతడిని దూరంగా ఉంచారని, అతడి కుటుంబం ప్రభుత్వంలో కీలక విభాగంతో సంబంధాలు ఉండటంతో తీవ్రమైన శిక్ష నుంచి తప్పించుకున్నట్లు వెల్లడించారు. దీని తర్వాత ‘‘విమర్శనా సమావేశానికి’’ హాజరై, తన ప్రవర్తనపై సొంత విమర్శలు రాయాల్సి వచ్చిందని తెలిపారు.
కిమ్ లో రెండు కోణాలు..
కిమ్ జోంగ్ ఉన్ సాధారణ మనిషిలా నవ్వే, ఇతరులపై శ్రద్ధ చూపే లక్షణాలను తాను గమనించినట్లు లీ చెప్పారు. అదే సమయంలో తన అధికారాన్ని సవాల్ చేసే వ్యక్తి ఉత్తర కొరియాలో లేదరని తెలిపారు. 2018 నవంబర్‌లో అప్పటి క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కానెల్ ఉత్తర కొరియాలో పర్యటించిన సమయంలో కార్యక్రమాల సమన్వయ బాధ్యతలను లీ ఇల్-గ్యు నిర్వహించారు. ఆ పర్యటనలో కిమ్‌తో చర్చలు, అధికారిక విందు, ప్యాంగ్‌యాంగ్‌లోని మే డే స్టేడియంలో కార్యక్రమం జరిగాయి. కిమ్‌లో ఒక సాధారణ మనిషి లక్షణాలు, మరోవైపు అపార అనుభవం ఉన్న నాయకుడి లక్షణాలు కనిపించాయలని చెప్పారు.

