Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!

  • మక్కా ఒప్పందానికి బీటలు!
  • హౌతీలపై యెమెన్‌లో పోరుకు టర్కీ నో!
  • సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
Mecca Defence Pact

Mecca Defence Pact

ఇరాన్ మద్దతు గల హౌతీలు సౌదీపై భీకర దాడులు చేస్తు్న్నారు. దీంతో సౌదీ హడలెత్తిపోతుంది. అయితే ఇటీవలే పాకిస్థాన్, టర్కీ, సౌదీ మధ్య మక్కా ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం శత్రువుపై దాడి చేస్తే మూడు దేశాలు కలిసి యుద్ధం చేయడమే ఒప్పందం ఉద్దేశం. అలాంటిది హౌతీలు ఇంత పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నా.. ఇప్పటి వరకు టర్కీ గానీ.. పాకిస్థాన్ మాత్రం స్పందించలేదు. ఇక టర్కీ అయితే తాజాగా తేల్చి చెప్పేసింది. హౌతీలపై దాడికి రాబోమని సౌదీకి టర్కీ తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. యెమెన్‌లోని హౌతీలపై పోరాడేందుకు తమ సైనికులను పంపబోమని టర్కీ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలతో.. మూడు దేశాల మధ్య కుదిరిన సామూహిక రక్షణ ఒప్పందం పరిధి ఎంతవరకు ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ వారం ప్రారంభంలోనే ఈ ఒప్పందాన్ని క్రియాశీలం చేసినట్లు సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ ప్రకటించాయి. సౌదీపై హౌతీల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో.. పరస్పర రక్షణకు కట్టుబడి ఉండటంతో పాటు అవసరమైన సైనిక బలగాలు, సామర్థ్యాలను వేగంగా మోహరించేందుకు ఈ మూడు దేశాలు అంగీకరించాయి. అయితే తాజాగా టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ చేసిన వ్యాఖ్యలు ఈ కూటమి సైనిక పాత్రకు పరిమితులు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి.

గురువారం మాట్లాడిన టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్.. ఈ ఒప్పందం ద్వారా తమ దేశం సౌదీ అరేబియాకు రక్షణపరమైన సహకారం అందిస్తుందని, కానీ మరో దేశ భూభాగంలోకి సైన్యాన్ని పంపి దాడులు చేయబోదని వెల్లడించారు. హౌతీల దాడులకు ప్రతిస్పందనగా ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన సమయంలోనే టర్కీ ఈ స్పష్టత ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు సౌదీ మద్దతు ఉన్న బలగాలు యెమెన్‌లో సైనిక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీకి రక్షణ సహకారం అందించడం వేరు.. యెమెన్‌లో నేరుగా యుద్ధంలో పాల్గొనడం వేరు అనే విషయాన్ని అంకారా స్పష్టం చేసినట్లయింది. ఈ ఒప్పందాన్ని టర్కీ పార్లమెంటు ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఫిదాన్ తెలిపారు. టర్కీ చట్టాల ప్రకారం విదేశాల్లో సైనికులను మోహరించేందుకు పార్లమెంటు ఆమోదం అవసరం.

యెమెన్‌లోకి సైన్యాన్ని పంపబోమని టర్కీ ప్రకటించినప్పటికీ.. సౌదీ అరేబియాకు ఇతర మార్గాల్లో సహకరించే అవకాశాలున్నాయి. సాంకేతిక సహాయం, గగనతల రక్షణ వ్యవస్థలు, నిఘా సమాచారం, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాలు, ఇతర సైనిక పరికరాలను అందించడం ఇందులో భాగంగా ఉండవచ్చు. సౌదీకి టర్కీ ప్రధానంగా సాంకేతిక, రక్షణపరమైన సహకారం అందిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అంటే సౌదీ భద్రతకు మద్దతు ఇవ్వడానికి అంకారా సిద్ధంగా ఉన్నప్పటికీ.. హౌతీలపై నేరుగా దాడులు చేసే విషయంలో వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్ 5న రియాద్‌లో జరిగిన అత్యవసర సమావేశంలో సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. సామూహిక నిరోధక చర్యలను క్రియాశీలం చేయడంతో పాటు, పరస్పర రక్షణకు సంబంధించిన ఒప్పందాలను అమలు చేయాలని అంగీకరించాయి. అవసరమైన సైనిక బలగాలు, సామర్థ్యాలను సౌదీ అరేబియాకు వేగంగా మోహరించేందుకు చర్యలు తీసుకుంటామని మూడు దేశాలు తెలిపాయి. ఆగస్టులో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం.. ఒక సభ్య దేశ భద్రతపై దాడిని, మూడు దేశాల ఉమ్మడి భద్రతకు ముప్పుగా పరిగణిస్తారు. అయితే ఒక దేశంపై దాడి జరిగితే మిగతా దేశాలు రక్షణ సహకారం అందించడం.. దాడి చేస్తున్న శత్రువుపై మరో దేశ భూభాగంలోకి వెళ్లి యుద్ధం చేయడం రెండూ ఒకటి కావని టర్కీ తాజా ప్రకటన స్పష్టం చేస్తోంది. హౌతీల దాడులు మరింత తీవ్రమైతే ఈ తేడా కీలకంగా మారే అవకాశం ఉంది.

పాకిస్థాన్ పాత్రపైనా సందేహాలు

ఈ పరిణామాల మధ్య పాకిస్థాన్ పాత్రపైనా చర్చ మొదలైంది. ఒప్పందంలో భాగంగా సౌదీ అరేబియాకు మరిన్ని సైనికులను పంపేందుకు పాకిస్థాన్ అంగీకరించినట్లు సమాచారం. అయితే ఎంతమంది సైనికులను పంపుతారు? వారిని ఎక్కడ మోహరిస్తారు? వారి విధులు ఏమిటి? అనే అంశాలపై ఇస్లామాబాద్ ప్రభుత్వం బహిరంగంగా వివరాలు వెల్లడించలేదు. 2015లో సౌదీ నేతృత్వంలోని యెమెన్ యుద్ధంలో తటస్థంగా ఉండాలని పాకిస్థాన్ పార్లమెంటు నిర్ణయించింది. ఇప్పుడు సౌదీకి మరింత సైనిక సహకారం అందించేందుకు తీసుకున్న నిర్ణయం ఆ పాత వైఖరితో ఎలా సరిపోతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు పాకిస్థాన్‌కు ఇరాన్‌తో ఉన్న సంబంధాలు కూడా ఈ వ్యవహారాన్ని సంక్లిష్టంగా మార్చే అంశం. హౌతీలకు ఇరాన్ మద్దతు ఇస్తున్నట్లు అంతర్జాతీయంగా పేర్కొంటుండగా.. ఇరాన్-అమెరికా వివాదంలో దౌత్యపరమైన పాత్ర పోషించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. సౌదీకి మరింత ప్రత్యక్ష సైనిక మద్దతు ఇస్తే.. ఇరాన్‌తో సంబంధాల విషయంలో ఇస్లామాబాద్‌కు ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది.

అప్పుడే విభేదాలా?

టర్కీ తాజా ప్రకటనతో మక్కా రక్షణ ఒప్పందం పూర్తిగా విఫలమైందని చెప్పలేం. అయితే ఈ కూటమి సైనిక సహకారానికి కొన్ని పరిమితులు ఉన్నాయని తొలి దశలోనే స్పష్టమవుతోంది. సౌదీ అరేబియాకు రక్షణ వ్యవస్థలు, సాంకేతిక సహకారం అందించేందుకు టర్కీ సిద్ధంగా ఉంది. కానీ హౌతీలపై యెమెన్‌లో నేరుగా పోరాడేందుకు సైనికులను పంపబోమని తేల్చిచెప్పింది. పాకిస్థాన్ సైనిక సహకారానికి అంగీకరించినప్పటికీ.. దాని పూర్తి స్వరూపంపై స్పష్టత లేదు. ఇదే సమయంలో సౌదీ అరేబియా తక్షణ భద్రతా ముప్పును ఎదుర్కొంటోంది.