NTV Telugu Site icon

CR Rao: గ‌ణిత‌ శాస్త్రవేత్త సీఆర్ రావు క‌న్నుమూత‌

Cr Rao

Cr Rao

CR Rao: గ‌ణిత‌ శాస్త్రవేత్త సీఆర్ రావుగా పేరుగాంచిన క‌ల్యంపుడి రాధాకృష్ణ రావు (CR Rao) క‌న్నుమూశారు. భార‌త్‌కు చెందిన‌ అమెరికా గ‌ణిత శాస్త్రవేత్త అయిన సీఆర్‌ రావు ప్రపంచంలోనే ప్రఖ్యాత సంఖ్యాశాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. 1968లో ఆయ‌న‌కు భార‌త ప్ర‌భుత్వం ప‌ద్మ భూష‌ణ్‌, 2001లో ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాల‌తో గౌరవించింది. స్టాటిస్‌టిక్స్ రంగంలో నోబెల్ బ‌హుమ‌తిగా భావించ‌బ‌డే ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్‌టిక్స్‌ను ఆయ‌న ఈ ఏడాది గెలుచుకున్నారు. ఆధునిక గ‌ణిత శాస్త్రంలో సీఆర్ రావును ప్రావీణ్యుడిగా పేర్కంటారు. మ‌ల్టీవేరియేట్ విశ్లేష‌ణ‌, శాంపిల్ స‌ర్వే థియరీ, బ‌యోమెట్రి లాంటి అంశాల్లో సీఆర్‌ రావు విస్తృతంగా పనిచేశారు. క‌ర్నాట‌క‌లోని హ‌డ‌గలిలో ఓ తెలుగు కుటుంబంలో 1920 సెప్టెంబరు 10న సీఆర్‌ రావు జ‌న్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గూడురు, నూజివీడు, నందిగామ‌, విశాఖ‌ల్లో ఆయ‌న పాఠశాల స్థాయి విద్యాభ్యాసం కొనసాగించారు. ఆంధ్రా యూనివ‌ర్సిటీ నుంచి ఎంస్సీ మ్యాథ‌మెటిక్స్‌లో ప‌ట్టా పొందారు. 1943లో క‌ల్‌క‌త్తా యూనివ‌ర్సిటీ నుంచి ఎంఏ స్టాటిస్‌టిక్స్ పూర్తి చేశారు. ఆ తరువాత గ‌ణిత శాస్త్రంలో పీహెచ్‌డీ కోసం ఆయ‌న బ్రిట‌న్ వెళ్లారు. స‌ర్ రోనాల్డ్ ఏ వ‌ద్ద పీహెచ్‌డీ పూర్తి చేశారు. తొలుత ఆయ‌న ఇండియ‌న్ స్టాటిస్‌టిక‌ల్ ఇన్స్‌టిట్యూట్‌, క్యాంబ్రిడ్జ్ ఆంథ్రోపోలాజిక‌ల్ మ్యూజియంలో ప‌నిచేశారు.

Read Also: Male and Female Genitalia: పిల్లలు పుట్టలేదని ఆసుపత్రికి వెళ్లగా.. పురుష, స్త్రీ జననాంగాలున్నాయని షాక్ ఇచ్చిన వైద్యులు!

కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్‌ కాలేజీలో 1948లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్‌ అయ్యారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆయన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ బఫెలోలో రీసెర్చ్‌ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. హైదరాబాద్‌లోని సీఆర్‌ రావు అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ వ్యవస్థాపకులైన ఆయన సేవలు కేవలం స్టాటిస్టికల్‌ రంగానికే కాకుండా ఎకనమిక్స్‌, జెనెటిక్స్‌, ఆంత్రోపాలజీ తదితర రంగాలకూ విశేషంగా ఉపయోగపడినట్లు ఇటీవల ఒక వెబినార్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సీవీ రావు 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్నారు. ఇప్పటివరకూ 477 పరిశోధన పత్రాలు సమర్పించారు. 15 పుస్తకాలు రాశారు. 2002లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ సైన్స్‌ పురస్కారం అందుకున్నారు. యూకే ఇంటర్నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటికల్‌ సైన్స్‌, ఇంటర్నేషనల్‌ బయోమెట్రిక్‌ సొసైటీకి అధ్యక్షుడిగా పని చేశారు. స్టాటిస్‌టిక్ టెక్నిక్‌ల‌ను అభివృద్ధి చేయ‌డంలో ఆయ‌న కీల‌క పాత్ర పోషించారు. క్రామెర్‌-రావు ఇనిక్వాలిటీ, రావు-బ్లాక్‌వెల్ థియరీ లాంటి టెక్నిక్‌ల‌ను సీఆర్‌ రావు డెవ‌ల‌ప్ చేశారు.