అమెరికాలో హైదరాబాద్ యువతి నిఖితారావు గొడిశాలను హత్య చేసి భారత్‌కు పారిపోయి వచ్చిన నిందితుడు అర్జున్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో తమిళనాడులో ఇంటర్‌పోల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిఖితారావు గొడిశాల (26) ఎల్లికాట్ సిటీలో నివాసం ఉంటుంది. స్ట్రాటజీ అనలిస్ట్ నిఖితా గోడిశాలగా గుర్తించినట్లు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. మేరీల్యాండ్‌లోని కొలంబియాలోని ట్విన్ రివర్స్ రోడ్‌లోని అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌లో జనవరి 3న గొడిషాల మృతదేహాన్ని కనుగొన్నారు.
నిఖితా రావు తప్పిపోయినట్లుగా అర్జున్ శర్మ జనవరి 2న పోలీసులకు సమాచారం అందించాడు. డిసెంబర్ 31న న్యూఇయర్ వేడుకల్లో చివరి సారిగా చూసినట్లు తెలిపాడు. పోలీసులకు సమాచారం అందించిన రోజే.. అర్జున్ శర్మ భారత్‌కు వచ్చేశాడు. జనవరి 3న అర్జున్ శర్మ ఇంట్లో నిఖితా రావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అర్జున్ శర్మనే చంపినట్లుగా గుర్తించి.. అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. నిరంతరం భారతీయ అధికారులతో సంప్రదింపులు జరపడంతో తాజాగా తమిళనాడులో నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇక బాధితురాలు సికింద్రాబాద్‌లోని లాలాగూడ వాసిగా తెలుస్తోంది. నిఖితారావు గొడిషాల ఫిబ్రవరి 2025 నుంచి వేదా హెల్త్‌లో డేటా, స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేస్తోంది. ఇటీవలే కంపెనీ ‘ఆల్-ఇన్ అవార్డు’ అందుకున్నట్లు కుటుంబానికి సన్నిహిత వర్గాలు తెలిపాయి.
నిఖితా గొడిశాల హత్యపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాధితురాలి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అన్ని విధాలా సాధ్యమైన సహాయాన్ని అందిస్తోందని వెల్లడించింది. అంతేకాకుండా స్థానిక అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది.
The Embassy is in contact with the family of Ms. Nikitha Godishala and is extending all possible consular assistance. The Embassy is also following up the matter with the local authorities. @MEAIndia
— India in USA (@IndianEmbassyUS) January 4, 2026
