NTV Telugu Site icon

Sri Lanka election: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే.. ఎన్నికల్లో ఘన విజయం..

Sri Lanka Election

Sri Lanka Election

Sri Lanka election: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిసానాయకే(55) విజయం సాధించారు. ఆయన శ్రీలంక అధ్యక్ష పదవిని అధిరోహించబోతున్నారు. మార్స్కిస్ట్ నేతగా, జనతా విముక్తి పెరమున పార్టీకి చెందిన అనుర కుమార రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలుపొందారు. 2022 ఆర్థిక మాంద్యం తర్వాత జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నికలు ఇవే. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక అభ్యర్థి విజయం మొదటి రౌండ్‌లో తేలకుండా రెండో రౌండ్‌కి చేరుకోవడం ఇదే తొలిసారి. మొదటి రౌండ్‌లో ఏ అభ్యర్థికి 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు రాకపోవడంతో, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు వెళ్లాల్సి వచ్చింది.

Read Also: Rishabh Pant: తన బ్యాట్ గ్లోవ్స్, హెల్మెట్‌కి మొక్కిన రిషబ్ పంత్.. ఫలించిన పూజలు

శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు శనివారం ఓటింగ్ జరిగింది. వెంటనే కౌంటింగ్ మొదలైంది. ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే మూడో స్థానంలో నిలిచి పోటీ నుంచి నిష్క్రమించారు. 20 ఏళ్లుగా పార్లమెంట్‌లో ఉన్న దిసానాయకేపై శ్రీలంక ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. శ్రీలంకలో రాజకీయంగా ప్రాబల్యం ఉన్న రాజపక్స కుటుంబంపై ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారు.

శనివారం జరిగిన ఎన్నికల్లో 55 ఏళ్ల దిసానాయకే 42.31% ఓట్లను సాధించారని, ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస రెండో స్థానంలో నిలిచారని శ్రీలంక ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. శ్రీలంకలోని 17 మిలియన్ల అర్హత కలిగిన ఓటర్లలో 75% మంది పాల్గొన్నారు.శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన దిసానాయకే తన విజయం తర్వాత జాతీయ ఐక్యత కోసం పిలుపునిచ్చారు. సింహళీయులు, తమిళులు, ముస్లింలు మరియు శ్రీలంక ప్రజలందరి ఐక్యత ఇది కొత్త ప్రారంభమని అన్నారు.