NTV Telugu Site icon

Marburg Virus: ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్.. ఇప్పటికే ఇద్దరు మృతి

Marburg Virus

Marburg Virus

ఎబోలా, కరోనా, మంకీపాక్స్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలో మరో ప్రాణాంతక వైరస్‌ వెలుగు చూసింది. ఆఫ్రికాలోని ఘనాలో మార్బర్గ్‌ వైరస్‌ను కనుగొన్నారు. రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దాని పీడ ఇప్పుడిప్పుడే తగ్గుతున్న తరుణంలో కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్‌లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ బయటపడింది. ఆఫ్రికాలోని ఘనా దేశంలో అతి ప్రాణాంతకమైన మార్బర్గ్‌ వైరస్‌ వెలుగు చూసింది. రెండు వారాల క్రితమే రెండు కేసులు నమోదు కాగా.. వ్యాధి సోకిన ఆ ఇద్దరు బాధితులు తాజాగా ప్రాణాలు కోల్పోయారు. వీటిని ధ్రువీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇద్దరు బాధితులతో సన్నిహితంగా మెలిగిన 34 మందిని గుర్తించినట్లు తెలిపింది. ప్రస్తుతం వారిని క్వారంటైన్‌లో ఉంచి, వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.

గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్‌ సోకిన జంతువులు/మనుషుల స్రావాలను నేరుగా తాకడం వల్ల సంక్రమిస్తుంది. వైరస్‌ సోకిన రెండు నుంచి 21 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. జ్వరం, రక్త విరేచనాలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, శరీరంలో అంతర్గత రక్తస్రావం, కండ్లు ఎర్రబడటం, మూత్రంలో రక్తం, తలనొప్పి, ఆయాసం వంటివి లక్షణాలుగా ఉంటాయి. మరణాల రేటు 88 శాతం వరకూ ఉంటుంది. “ఘనాలోని సదరన్‌ అశాంతి ప్రాంతంలో మార్బర్గ్‌ వైరస్‌కు సంబంధించి రెండు అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. ప్రాథమిక విశ్లేషణ కోసం బాధితుల నుంచి నమూనాలను సేకరించాం. అయితే, ఆ ఇద్దరు బాధితులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారని” ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

Red Alert: హైదరాబాద్‌కు రెడ్‌ అలెర్ట్ జారీ.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..!

మార్బర్గ్ వైరస్ చాలా ప్రమాదకరమైందని, ఇది చాలా దూరం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున తొలి దశలోనే నిలువరించాలని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. గినియాలో గతేడాది ఎబోలా వైరస్ సోకి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వైరస్‌ను అరికట్టిన కొద్ది నెలల్లోనే మార్బర్గ్ వైరస్ బయటపడటం ఆందోళన కలిగిస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. పశ్చిమ ఆఫ్రికాలో వైరస్ కనుగొనడం ఇదే మొదటిసారని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. అధిక జ్వరం, రక్త విరేచనాలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, శరీరంలో అంతర్గత రక్తస్రావం, కళ్లు కూడా ఎర్రగా మారడం, మూత్రంలోనూ రక్తం కనిపించడం ఈ వైరస్ లక్షణాలని తెలిపింది. ఇదిలాఉంటే, దక్షిణ, తూర్పు ఆఫ్రికా ప్రాంతాల్లో 1967 నుంచి ఈ వైరస్‌కు సంబంధించిన కేసులు అప్పుడప్పుడు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పశ్చిమ ఆఫ్రికాలో గినియాలో మాత్రం 16 సెప్టెంబర్‌ 2021న తొలిసారి ఈ వైరస్‌ బయటపడింది. తొలి కేసు గుర్తించిన ఐదు వారాల తర్వాత అక్కడ మరో కేసు బయటపడింది. పశ్చిమ ఆఫ్రికాలో మాత్రం మార్బర్గ్‌ వైరస్‌ వెలుగు చూడడం రెండోసారి. అంతకుముందు అంగోలా, కాంగో, కెన్యా, దక్షిణాఫ్రికా, ఉగాండా దేశాల్లోనూ ఈ ప్రాణాంతక వైరస్‌ కేసులు వెలుగు చూశాయి.