Mahatma Gandhi statue defaced: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. ఇండియాకు వ్యతిరేకంగా విదేశాల్లో విధ్వంసానికి పాల్పడుతున్నారు. బ్రిటన్, కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో హిందూ దేవాలయాలు, రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా కెనడా ఓంటారియో ప్రావిన్స్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హామిల్టన్ పట్టణంలోని సిటీ హాల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో 2012 నుంచి విగ్రహం ఉంది.
భారత ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన ఆరుడుగుల పొడవైన కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో పాటు గ్రాఫిటీతో విద్వేషపూరిత రాతలు రాశారు. ప్రధాని నరేంద్రమోదీని విద్వేషపూరిత వ్యాఖ్యలను రాశారు. విగ్రహం వద్ద ఉన్న వాకింగ్ స్టిక్ కు ఖలిస్తానీ జెండాను ఎగరేశారు. తెల్లవారుజామున ఈ విధ్వంసాన్ని స్థానిక అధికారులు గమనించి విగ్రహాన్ని శుభ్రం చేయించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు హామిల్టన్ పోలీసులు వెల్లడించారు.
Read Also: Girl Kidnap: 12ఏళ్ల బాలిక కిడ్నాప్.. పదిరోజుల తరువాత పోలీసులకు ఫిర్యాదు
గత ఫిబ్రవరిలో గ్రేటర్ టొరంటో ఏరియాలోని హిందూ ఆలయంపై, ఎనిమిది నెలల క్రితం ఇదే తరహాలో శ్రీరామ మందిరంపై దాడులు చేశారు. జనవరి 30న బ్రాంప్టన్ లోని గౌరీ శంకర్ మందిర్, రిచ్ మండ్ హిల్ లోని విష్ణు మందిర్ ఆలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని గతేడాది జూలై ధ్వంసం చేశారు. సెప్టెంబర్ నెలలో టొరంటోని బీఏపీఎస్ శ్రీ స్వామినారాయన్ మందిర్ ముందు ద్వారం వద్ద ఇటువంటి విధ్వంసమే జరిగింది. ఈ ఘటనల వెనక ఉన్నవారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఖలిస్తానీ వేర్పాటు వాదులు, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) వారి ప్రయేయం ఉందని భారత్ చాలా సార్లు కెనడా ప్రభుత్వానికి తెలిపింది.
ఖలిస్తానీ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతడికి మద్దతుగా వేర్పాటువాదులు విదేశాల్లో భారత దేశాన్ని టార్గెట్ చేస్తున్నారు. గత ఆదివారం, బుధవారాల్లో యూకే లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేశారు.
