ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కరోనాకు కేరాఫ్ అడ్రస్ గా భావించే చైనా దేశం వణికిపోతోంది. తాజాగా అక్కడ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. చైనాలో కేసుల సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 1,219 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ విజృంభణను కట్టడి చేయడానికి చైనాలోని అతిపెద్ద నగరం అయిన షాంఘైలో ఐదు రోజులపాటు లాక్‌డౌన్ విధించారు. దేశవ్యాప్తంగా రోజూవారీ కేసుల్లో తాజా పెరుగుదలకు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంటే కారణమని చెబుతున్నారు. జిలిన్ ప్రావిన్సు, టెక్ హబ్ సిటీ షెన్‌జెన్‌లోని లక్షలాది మంది ప్రజలకు లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తున్నారు. షాంఘైలాంటి ఇతర నగరాలు కూడా ప్రయాణాలపై ఆంక్షలు విధించడం ద్వారా కరోనా నిబంధనలను కఠినతరం చేశాయి. దీంతో చైనా వెళ్ళేవారిపై, చైనానుంచి వచ్చేవారిపై కోవిడ్ ప్రోటోకాల్స్ అమలుచేస్తున్నారు.
ఈ లాక్ డౌన్ సోమవారం నుంచి శుక్రవారం వరకు కొనసాగనుంది. ప్రజలు తప్పనిసరి అయితేనే తప్ప ఇంటి నుంచి బయటకు రావడానికి వీళ్లేదని అధికారులు ఆదేశించారు. కరోనా కట్టడిలో భాగంగా అక్కడ వర్క్ ఫం హోం అమలుచేస్తున్నారు. వ్యాపార సంస్థలు మూసివేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలులో ఉంది. షాంఘైలోని డిస్నీ థీమ్ పార్క్‌ను సైతం ఇప్పటికే మూసివేశారు. గడిచిన నెలలో చైనాలో 56 వేల కేసులు నమోదయ్యాయి. చైనాలో టీకా పంపిణీ రేటు దాదాపు 87 శాతంగా ఉండగా.. వృద్ధులలో ఇది చాలా తక్కువగా ఉంది. 60 ఏళ్లకు పైబడిన వారిలో 5.2 కోట్ల మంది టీకాలు తీసుకోలేదని చైనా జాతీయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వృద్ధులు ఈమహమ్మారి బారిన పడే అవకాశాలున్నాయని జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.