NTV Telugu Site icon

Israel: రాకెట్ విఫలమై గాజా ఆస్పత్రి పేలుడు.. ఆధారాలు చూపిన ఇజ్రాయిల్..

Israel

Israel

Israel: గాజాలో అల్-అహ్లీ ఆస్పత్రిపై జరిగిన దాడిలో ఏకంగా 500 మంది మరణించడంపై యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే ఈ దాడి ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కొత్త టర్న్ తీసుకుంది. ఈ దాడికి మీరంటే మీరే కారణమని ఇజ్రాయిల్, హమాస్ ఒకరినొకరిని నిందించుకుంటున్నాయి. ఇజ్రాయిల్ వైమానికదాడులు వల్లే ఆస్పత్రి దాడికి గురైందని హమాస్ ఆరోపించగా.. గాజాలోని ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్ మిస్ ఫైర్ కావడం వల్లే పేలుడు సంభవించిందని ఇజ్రాయిల్ తెలిపింది. దీనికి సంబంధించిన ఆధారాలను ఇజ్రాయిల్ ఢిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెలుగులోకి తెచ్చింది.

గాజా ఆస్పత్రిపై బాంబుదాడిలో తమ ప్రమేయాన్ని ఇజ్రాయిల్ సైన్యం బుధవారం ఖండించింది. వైమానికదాడిలో వల్ల పేలుడు సంభవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. ‘‘హమాస్ ఉగ్రవాదులు ఇస్లామిక్ జిహాద్ నేతతో రాకెట్ మిస్ ఫైర్ గురించి చర్చిస్తున్నట్లు’’ పేర్కొన్న ఓ ఆడియో రికార్డింగ్ ను ఇజ్రాయిల్ ఆర్మీ విడుదల చేసింది.

Read Also: Tharun Bhascker: ‘సురేష్ కొండేటి’తో సినిమా చేస్తా.. జర్నలిస్టును అయిపోతానంటున్న తరుణ్ భాస్కర్

ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ వైపు ప్రయోగించిన రాకెట్ మిస్ ఫైర్ కావడంతో ఆస్పత్రిపై పడిందని తెలిపారు. ఇస్లామిక్ జిహాద్ గాజా, వెస్ట్ బ్యాంకుల్లో పనిచేస్తున్న పాలస్తీనా ఉగ్రవాద సంస్థ. హమాస్ నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఇజ్రాయిల్ ఈ ఆధారాలను తీసుకువచ్చింది. ఆస్పత్రి ఉన్న ప్రాంతంలో గాలి నుంచి భూమి నుంచి, సముద్రం ద్వారా ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎలాంటి దాడులు జరపలేదని దర్యాప్తులో తేలినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ ప్రకటించింది.

ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఒకే ప్రాంతంలో 500 మంది వరకు మరణించడం ఇదే తొలిసారి. గాజాలో ఆస్పత్రి ఘటనకు ఇస్లామిక్ జిహాద్ కారణమని నిర్దారించింది. ఆస్పత్రి చుట్టుపక్కట నుంచి సాయంత్రం సమయంలో ఇజ్రాయిల్ పైకి రాకెట్లను పంపిందని, అదే రాత్రి ఆస్పత్రిలో పేలుడు సంభవించిందని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. ఈ దాడితో జోర్డాన్, లెబనాన్, టర్కీ, వెస్ట్ బ్యాంకుల్లో ప్రజలు తీవ్ర నిరసన తెలిపారు.