Lebanon Israel War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో సుమారు 30 మంది ప్రాణాలు విడిచారు. బర్జా పట్టణంపై మంగళవారం రాత్రి జరిగిన దాడిలో ఓ అపార్టుమెంట్ కూలిపోయింది. బుధవారం సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న 30 మృత దేహాలను బయటకు తీశారు. మరికొందరు శిథిలాల కిందే ఉన్నట్లు స్థానికులు చెప్పారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముందస్తు హెచ్చరికలు లేకుండా చేపట్టిన ఈ దాడిపై ఇజ్రాయెల్ ఆర్మీ రియాక్ట్ కాలేదు.
Read Also: Astrology: నవంబర్ 07, గురువారం దినఫలాలు
అయితే, తీర ప్రాంత సిడాన్ నగరానికి ఉత్తరాన ఉన్న ఈ పట్టణంపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడి చేయలేదు. ఇదిలా ఉండగా, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా సాయుధ గ్రూపు బుధవారం ఇజ్రాయెల్‌పైకి దాదాపు 10 రాకెట్లతో దాడి చేసింది. టెల్‌అవీవ్‌లో రాకెట్లు వస్తున్నట్లు సైరన్లు మోగాయి. ఒక రాకెట్ శకలం సెంట్రల్ ఇజ్రాయెల్ నగరం రాననలోని పార్కు చేసిన కారుపై పడిపోయింది. టెల్ అవీవ్‌లోని ప్రధాన ఎయిర్ పోర్ట్ సమీపంలోని బహిరంగ ప్రాంతంలో రాకెట్లు పడ్డాయని అక్కడి స్థానిక మీడియా తెలిపింది. విమానాల రాకపోకలు మాత్రం కొనసాగాయని చెప్పుకొచ్చింది. రాకెట్ల దాడిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సహాయక బృందాలు వెల్లడించాయి.