King Charles Coronation: కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషేకానికి బ్రిటన్ సిద్దం అయింది. విదేశాల నుంచి వచ్చే ప్రముఖులు, రాజకుటుంబీకుల మధ్య ఈ రోజు ఆయన పట్టాభిషేకం అట్టహాసంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి భారతదేశం తరుపున ఉపరాష్ట్రపతి జగధీప్ ధన్ ఖడ్ హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కింగ్ ఛార్లెస్-3, ఆయన భార్య రాణి కెమిల్లా ధరించే కిరీటాలపై అందరి ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమంలో మొత్తం మూడు కిరీటాలు ఉపయోగించనున్నారు. ఇందులో రెండు రాజుకు సంబంధించినవి కాగా.. ఒక దానిని రాణి ధరిస్తారు.
సెయింట్ ఎడ్వర్డ్స్ క్రౌన్:
రాజు ధరించే కిరీటాల్లో సెయింట్ ఎడ్వర్డ్స్ కిరీటం మొదటిది. దీన్ని పట్టాభిషేకం సమయంలో కాంటర్‌బరీ ఆర్చ్ బిషప్ రాజు తలపై ఉంచుతారు. 1649లో కరిగిపోయిన మధ్యయుగ కిరీటానికి బదులుగా 1661లో కింగ్ చార్లెస్ II కోసం ఈ కిరీటం తయారు చేయబడింది. దీన్ని చివరిసారిగా ఛార్లెస్-3 తల్లి చనిపోయిన క్వీన్ ఎలిజబెత్-2 సమయంలో ఆమె పట్టాభిషేకం సమయంలో ఉపయోగించారు. 2.2 కిలోల బరువు ఉన్న ఈ కిరీటం కెంపులు, నీలమణి, గోమేదికం, పుష్యరాగం, అమెథిస్ట్, టూర్మాలిన్ లాంటి విలువైన రాళ్లను బంగారు కిరీటంలో అమర్చారు.
ఇంపీరియల్ స్టేట్ క్రౌన్:
పట్టాభిషేకం వేడులక ముగింపు సమయంలో కింగ్ ఛార్లెస్ సెయింట్ ఎడ్వర్డ్స్ కిరీటాన్ని తీసేసి ఇంపీరియల్ స్టేట్ కిరీటాన్ని ధరిస్తారు. ఇంపీరియల్ స్టేట్ క్రౌన్ అనేది పార్లమెంట్ స్టేట్ ఓపెనింగ్ వంటి వేడుకల సందర్భాలలో కూడా ఉపయోగించబడుతుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన క్వీన్ ఎలిజబెత్ II ప్రభుత్వ అంత్యక్రియల్లో చివరిసారిగా వాడారు.
1.06 కిలోల బరువు ఉండే ఈ కిరీటం ఎత్తు 31.5 సెంటీమీటర్లు. దీనిలో 2,868 వజ్రాలు, 17 నీలమణి, 11 పచ్చలు, 269 ముత్యాలు, నాలుగు కెంపులు అమర్చబడ్డాయి. ఈ కిరీటంలో కల్లినన్ 2 వజ్రం ఉంది. ఇది కల్లినన్ వజ్రం నుంచి కత్తిరించిన రెండో అతిపెద్ద రాయి, ఇది ఇప్పటి వరకు కనుగొనబడిన అతిపెద్ద వజ్రమని రాయల్ కలెక్షన్ ట్రస్ట్ చెబుతోంది.
క్వీన్ మేరీస్ క్రౌన్:
ఈ కిరీటాన్న పట్టాభిషేకం సమయంలో క్వీన్ కోసం ఉపయోగిస్తారు. ఆధునిక కాలంలో క్వీన్ పట్టాభిషేకం కోసం తొలిసారిగా దీన్ని ఉపయోగించనున్నారు. క్వీన్ ఎలిజబెత్ 2 ఆభరణాల్లోని కుల్లినన్ 3, 4, 5 వజ్రాలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ కిరీటంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, భారత్ నుంచి బ్రిటిషర్లు తీసుకెళ్లిన 105.6 క్యారెట్ల కోహినూర్ వజ్రం ఉండదు. ఒకవేళ దీన్ని ఉపయోగించనట్లయితే భారత్ నుంచి దౌత్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికే భారత్ దాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తుందని బీబీసీ వెల్లడించింది.