Site icon NTV Telugu

Kim Jong Un: క్షిపణి ప్రయోగాల వెనుక.. అసలు కారణం చెప్పిన కిమ్

Kim Jong Un On Nuclear

Kim Jong Un On Nuclear

Kim Jong Un Reveals His Goal Over Nuclear Tests: ఉత్తర కొరియా ఎప్పుడూ లేనంతగా ఈమధ్య కాలంలో వరుస క్షిపణి ప్రయోగాలు చేస్తోన్న విషయం తెలిసిందే! కొన్ని రోజుల కిందటే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని సైతం చేపట్టింది. ఇలా వరుస క్షపణి ప్రయోగాలతో హడలెత్తిస్తున్న ఈ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా దాని వెనుక గల కారణాల్ని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉండటమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. ఉత్తర కొరియా అతిపెద్ద బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షలో భాగమైన సైనిక అధికారులను అభినందించిన ఈయన.. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తమ దేశంతో పాటు పౌరుల గౌరవం, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకే అణుశక్తిని నిర్మిస్తున్నామని కిమ్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన అణ్వాయుధ శక్తిగా నిలవడమే తమ దేశ లక్ష్యమని వెల్లడించారు. హ్వాసాంగ్‌-17 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధంగా అభివర్ణించిన ఆయన.. ఇది పటిష్ఠమైన సైన్యాన్ని నిర్మించగల ఉత్తర కొరియా సంకల్పం, సామర్థ్యాన్ని చాటుతుందని తెలిపారు. బాలిస్టిక్ క్షిపణులపై అణు వార్‌హెడ్‌లను అమర్చే సాంకేతికత అభివృద్ధిలో తమ దేశ శాస్త్రవేత్తలు అద్భుతమైన ముందడుగు వేశారని కొనియాడారు. కాగా.. ఉత్తర కొరియా ఈ ఒక్క సంవత్సరంలో మాత్రమే ఇప్పటివరకు ఎనిమిది ఖండాంతర క్షిపణులను పరీక్షించడం గమనార్హం.

ఇదిలావుండగా.. ఇటీవల ఉత్తర కొరియా ఖండాతర క్షిపణిని ప్రయోగించిన 24 గంటల్లోపే అమెరికా, కొరియా ద్వీపకల్పం లక్ష్యంగా వ్యూహాత్మక బాంబర్లను మరోసారి మోహరించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే కొరియా ద్వీపకల్పంపై అమెరికా వాయుసేనకు చెందిన బీ-1బీ వ్యూహాత్మక బాంబర్లను మళ్లీ మోహరించామని దక్షిణ కొరియా ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు అత్యాధునిక ఎఫ్‌-35 యుద్ధ విమానాలు కూడా తమ సైనికవిన్యాసాల్లో పాలుపంచుకుంటున్నట్లు ఆ దేశం పేర్కొంది.

Exit mobile version