Kim Jong Un: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ భేటీ అవుతారనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో కిమ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం విడుదలైన ఫోటోల్లో కిమ్ స్కీ రిసార్ట్‌ను సందర్శించారు, సిగరెట్ కాలుస్తూ, చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) విడుదల చేసింది. ఈ ఫోటోలో కిమ్ వెనక భార్య రి సోల్ జు కూడా నిలబడి ఉన్నారు.
చైనా దక్షిణాది నగరమైన షెన్‌జెన్‌లో ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ (APEC) శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇస్తోంది. ఈ సమావేశానికి ట్రంప్ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కిమ్ చైనా సరిహద్దు సమీపంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చైనా పర్యటన సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశమయ్యే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో కిమ్‌తో మూడు సార్లు సమావేశయ్యారు. చైనా పర్యటనకు బయలుదేరే ముందు మరోసారి కిమ్‌తో భేటీ అయ్యే విషయాన్ని ట్రంప్ కొట్టిపారేయలేదు. ‘‘మేము కిమ్ జోంగ్ ఉన్‌ను కూడా కలుసుకోవచ్చు. అది బాగుంటుంది. కిమ్ వస్తారా లేదా అనేది చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై ఆధారపడి ఉంటుంది’’ అని ట్రంప్ అన్నారు.
ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలోనే ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా కీలక విషయాన్ని వెల్లడించింది. కిమ్ తన కుటుంబ సభ్యులు, పార్టీ అధికారులతో కలిసి ఆదివారం, సోమవారం చైనా సరిహద్దుకు సమీపంలోని ఓ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో నార్త్ కొరియా భవిష్యత్ నాయకురాలిగా భావిస్తున్న కిమ్ కుమార్తె జు ఏ కూడా ఉన్నారు.
చైనా సరిహద్దుకు సమీపంలో పర్యటన..
కిమ్ సమ్జియోన్ నగరాన్ని సందర్శించారు. ఇది చైనాకు సమీపంలో ఉంది. ఉత్తర కొరియన్లు పవిత్ర జన్మస్థలంగా భావించే మౌంట్ పెక్టుకు ఈ ప్రాంతం దగ్గరలో ఉంటుంది. ఈ పర్వతమే కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ జన్మస్థలంగా పరిగణిస్తారు. ఈ ప్రదేశంలో స్కీ కేంద్రాలు, హోటళ్లతో పాటు రిసార్ట్‌ల నిర్మాణాలను కిమ్ పరిశీలించారు.

