Hardeep Singh Nijjar: ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గత కొంతకాలంగా కోరుతున్న ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. కెనడాలో బ్రిటీష్ కొలంబియా ప్రావిన్సుల్లో పంజాబీలు ఎక్కువగా ఉండే సర్రే ప్రాంతంలో గురునానక్ సిక్కు గురుద్వారా వద్ద కాల్చి చంపబడ్డాడు. నిజ్జర్ సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా అధ్యక్షుడిగా ఉన్నాడు. భారతదేశానికి వ్యతిరేకం పలు కార్యక్రమాల నిర్వహణలో ఇతని పాత్ర కీలకంగా ఉంది. భారతదేశం నుంచి పంజాబ్ వేరు చేయాలని డిమాండ్ చేస్తున్న వేర్పాటువాద సంస్థ ‘సిక్ ఫర్ జస్టిస్’(SFJ)లో నిజ్జర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల బ్రాంప్టన్ సిటీలో ఖలిస్తాన్ కి మద్దతుగా ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించిన వ్యక్తుల్లో ఇతనే కీలకంగా పనిచేశాడు.
Read Also: Maharashtra: బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోయేందుకు టీనేజ్ బాలిక కిడ్నాప్ డ్రామా..
అసలు ఇవరీ హర్దీప్ సింగ్ నిజ్జర్:
పంజాబ్ నుంచి కెనడాకు వలసవెళ్లిన నిజ్జర్ ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్ గా ఉన్నారు. వివిధ హింసాత్మక చర్యలు, విధ్వంసక కార్యకలాపాల్లో ఇతని ప్రమేయం ఉంది. భారత ప్రభుత్వం ఇతడిని ‘వాంటెడ్ టెర్రరిస్టు’గా ప్రకటించింది. 40 మంది భారత వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో నిజ్జర్ పేరు కూడా ఉంది.
కెనడాలో భారతీయ రాయబార కార్యాలయాలపై జరిగిన దాడుల్లో నిజ్జర్ ప్రమేయం ఉందని గతంలో విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ప్రస్తావించారు. ‘RAW’, ‘NIA’ ఈ దాడులకు సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ఉగ్రదాడులకు కుట్ర పన్నారనే ఆరోపణలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గతంలో నిజ్జర్‌పై చార్జిషీట్ దాఖలు చేసింది. పంజాబ్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజ్జర్‌పై చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను భారత్ కోరింది.
2022లో భారత దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పరారీలో ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ పై రూ. 10 లక్షల రివార్డు ప్రకటించింది. పంజాబ్ జలంధర్ లో హిందూ పూజారి హత్యకు కుట్ర పన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. జలంధర్‌లో హిందూ పూజారిని చంపడానికి ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కెటిఎఫ్) పన్నిన కుట్రకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కోరుతోంది. కెనడా వేదికగా ఇండియాలో అశాంతి రేపేందుకు నిజ్జర్ ప్రయత్నిస్తున్నాడు.