Karoline Leavitt: వైట్‌హౌస్‌కు దూరం కాబోతున్న ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్.. కారణమిదే!

  • వైట్‌హౌస్‌కు దూరం కాబోతున్న ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్
  • శుక్రవారమే తన చివరి ప్రెస్‌మీట్ అని వెల్లడి
  • కరోలిన్ లీవిట్ స్థానాన్ని భర్తీ చేయని వైట్‌హౌస్
Karolineleavitt

Karolineleavitt

కరోలిన్ లీవిట్.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ. అమెరికా ప్రభుత్వ నిర్ణయాలను.. ట్రంప్ పర్యటన వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేసేందుకు వెంటనే వైట్‌హౌస్‌లో ప్రత్యక్షమయ్యేది. అలాంటిది శుక్రవారం తన చివరి ప్రెస్‌మీట్ అని పేర్కొన్నారు. దీంతో ఆమె వైట్‌హౌస్‌కు దూరమవుతోందని అర్థమైంది.

ప్రసూతి సెలవుపై వెళ్తున్నట్లుగా కరోలిన్ లీవిట్ తెలిపింది. త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లుగా ప్రకటించింది. ఏ క్షణమైనా తనకు ప్రసవం కావొచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో కొంత కాలం వైట్‌హౌస్ విధులకు దూరం కాబోతున్నట్లుగా వెల్లడించింది. అయితే తన స్థానంలో ఎవరు ప్రెస్ బ్రీఫింగ్ నిర్వహిస్తారన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. తన స్థానంలో వైట్‌హౌస్ బృందం సమర్థవంతంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అయితే కరోలిన్ లీవిట్ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లాంటి సీనియర్ నాయకులు ప్రెస్‌మీట్ నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

కరోలిన్ లీవిట్.. 28 ఏళ్ల వయసులోనే ఈ కీలక పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. రిపబ్లికన్ ప్రభుత్వ తరఫున మీడియాకు గట్టి సమాధానాలు ఇవ్వడంలో కరోలిన్ లీవిట్ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పటికే ఆమె 2024 జూలైలో ఒక కుమారుడికి జన్మించింది. మొదటి బిడ్డ జననం తర్వాత కొద్ది రోజుల్లోనే ఆమె తిరిగి విధుల్లో చేరారు. భర్త నికోలస్ రిచ్చియో.. రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త.

కరోలిన్ లీవిట్ స్థానంలో మరొకరిని వైట్‌హౌస్ అధికారికంగా నియమించలేదు. ఆమె ఎంతకాలం పాటు సెలవులో ఉంటారో కూడా వైట్‌హౌస్ తెలియజేయలేదు. కొత్త వారిని నియమిస్తుందా? లేదంటే సీనియర్ నాయకులు ప్రెస్‌మీట్ నిర్వహిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.