ఐసిస్‌పై అమెరికా ప్రతీకార దాడులు ప్రారంభించింది. కాబూల్ పేలుళ్లకు పాల్పడ్డ ఐసిస్-కె టెర్రరిస్టులపై డ్రోన్ దాడులు జరిపింది. పేలళ్ల బాధ్యులైన వారిని వెంటాడి వేటాడి చంపుతాం అని అధ్యక్షుడు జో బైడన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా ఈ దాడులు చేపట్టింది. శనివారం తూర్పు ఆఫ్గనిస్తాన్‌లోని నంగర్‌హార్ ప్రావిన్స్‌లో డ్రోన్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇస్లామిక్‌స్టేట్ తీవ్రవాదుల అడ్డాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో కాబూల్ పేలుళ్ల మాస్టర్‌మైండ్ హతమయ్యాడు. అయితే దీనిని అమెరికా సైనిక అధికారులు నిర్ధారించలేదు. దాడులు తీవ్రవాది చనిపోయాడని మాత్రమే అంటున్నారు. ఇక ఆపరేషన్‌లో సామాన్య పౌరులు ఎవరూ చనిపోలేదు.
కాబూల్ ఆక్రమణ తరువాత అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా పౌరు తరలింపు వేగవంతమైంది. దాదాపు తుది దశకు చేరుకుంది. మరో వెయ్యి మంది పౌరులను తరలించాల్సి వుంది. అయితే కాబూల్ ఏర్‌పోర్ట్ దాడులను అమెరికా ముందే ఊహించి ఆ చుట్టు పక్కలకు వెళ్ల వద్దని తమ పౌరులను హెచ్చరించింది. వారిని సురక్షితంగా దేశం దాటించాలంటే ముందు ఐసిస్-కే అంతు చూడాలనుకుంది అమెరికా. టెర్రరిస్టులు మళ్లీ దాడులకు తెగబడతారన్న ఇంటిలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ప్రెసిడెంట్ బైడన్ ఈ డ్రోన్ డాదులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌పై అమెరికా అధికారిక ప్రకటన చేయాల్సి వుంది.
అమెరికా ఇంత త్వరగా ఐసిస్ మిలిటెంట్లపై విరుచుకుపడుతుందని ఎవరూ ఊహించలేదు. పేలుళ్లకు పాల్పడ్డామని ప్రకటించిన ఐసిస్-కెపై ప్రతీకార దాడులకు తక్షణం ప్లాన్ రెడీ చేయాలని బైడెన్ అమెరికా రక్షన శాఖ అధికారులను ఆదేశించారు. బైడెన్ ఇలా చెప్పాడో లేదో పెంటగాన్ డ్రోన్ దాడితో యాక్షన్‌లోకి దిగింది. గురువారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో కాబుల్ ఎయిర్ పోర్ట్ దగ్గర దాడి ఆత్మాహుతి పేలుడు జరిగింది. ఎయిర్‌పోర్ట్ అబే గేట్ దగ్గర సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. ఆ తర్వాత మరో టెర్రరిస్టు అక్కడి జన సమూహంపైకి కాల్పులు జరిపాడు. అమెరికా, బ్రిటన్ సైనికులు ప్రజలను తనిఖీ చేసి ఈ గేట్ నుంచే విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు.
తరువాత కొన్ని నిమిషాల తేడాతో బ్రిటిష్ అధికారులు ఉన్న హోటల్ దగ్గర పేలుడు జరిగింది. బ్రిటన్ వీసాకోసం అఫ్గాన్లు చేసుకున్న దరఖాస్తులను ఈ హోటల్‌లో పరిశీలిస్తుంటారు. అందుకే ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేశారు. గురువారం నాటి ఆత్మహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులతో పాటు దాదాపు 200 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ -ISKPకి రెండు ప్రధాన ఉద్దేశాలతో కాబూల్ పేలుళ్లకు పాల్పడింది. మొదట విమానాశ్రయంపై దాడి చేసి తమ ప్రత్యర్థి తాలిబాన్ల పరువు తీయటం. రెండో అంశం మహిళలు,మైనారిటీలకు భద్రత కల్పించటంలో తాలిబన్లు విఫలమవుతారని ప్రపంచానికి చెప్పటమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాడుల్లో చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.
