Site icon NTV Telugu

Joe Biden: డర్టీ బాంబ్ రచ్చ.. రష్యాకి బైడెన్ వార్నింగ్

Joe Biden Warns Russia

Joe Biden Warns Russia

Joe Biden Gives Strong Warning To Russia Over Dirty Bomb: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్‌పై అణు బాంబును ప్రయోగిస్తే.. రష్యా క్షమించరాని తప్పిదం చేసినట్లే అవుతుందని హెచ్చరించారు. డర్టీ బాంబ్‌(అణు బాంబ్‌)పై రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో.. మంగళవారం వైట్ హౌస్‌లో మాట్లాడుతూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. అణుబాంబుల గురించి వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో తనకు తెలియదన్న జో బైడెన్.. ఒకవేళ ఉక్రెయిన్‌పై రష్యా డర్టీ బాంబ్ ప్రయోగిస్తే మాత్రం ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు.

కాగా.. ఇటీవల ఐరోపాలోని అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రంలో రష్యా రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తోందని ఉక్రెయిన్ న్యూక్లియన్ ఎనర్జీ ఆపరేటర్ ఆరోపిణలు చేయగా, ఉక్రెయినే డర్టీ బాంబ్ ప్రయోగించేందుకు సిద్ధమవుతోందని రివర్స్‌లో రష్యా ఆరోపించింది. తాము స్వాధీనం చేసుకున్న ఖేర్‌సన్ ప్రాంతంలో దాడి చేసేందుకు రెడీ అవుతోందని.. సొంత ప్రజలపైనే అణుబాంబు ప్రయోగించి, దాన్ని తమ మీద తోసేందుకు కుట్ర పన్నుతోందని రష్యా తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాము ఖేర్‌సన్ నుంచి తమ బలగాలను ఖాళీ చేయిస్తున్నామని.. డర్టీ బాంబ్‌ విషయంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తేల్చుకుంటామని పేర్కొంది. అయితే.. రష్యా చేసిన ఈ ఆరోపణలను నాటో దేశాలు ఖండించాయి. యుద్ధంలో ఉద్రిక్తతలను పెంచేందుకే.. రష్యా ఈ తరహా ఆరోపణలకు దిగిందని మండిపడ్డాయి.

ఇదిలావుండగా.. ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా, ఈమధ్య ఉక్రెయిన్‌పై దాడులు మరింత తీవ్రతరం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మిలిటరీ మొబిలైజేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే రష్యా-క్రిమియా బ్రిడ్జిపై ఉక్రెయిన్ దాడులు చేయడంతో.. అందుకు ప్రతీకారంగా రష్యా భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో కీవ్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, కీలక భవనాలు ధ్వంసమయ్యాయి. కొంతమంది చనిపోగా.. చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు.

Exit mobile version