Site icon NTV Telugu

Ukraine Crisis: బైడెన్ కీలక ప్రకటన.. అత్యాధునిక ఆయుధ సాయం

Joe Biden Rocket Weapons

Joe Biden Rocket Weapons

రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి.. అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధ సాయాన్ని ఉక్రెయిన్ కోరుతోంది. అయితే, అమెరికా మొదట్లో మౌనం పాటించింది. వరుసగా నిషేధాలు విధిస్తూ.. రష్యాని దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తూ వస్తోందే తప్ప, ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం అందించే విషయంపై మాత్రం ఎలాంటి కదిలికలు చేపట్టలేదు. ఎట్టకేలకు ఇన్నాళ్ళ తర్వాత ఆయుధ సాయం అందించేందుకు అమెరికా ముందుకొచ్చింది. స్వయంగా అధ్యక్షుడు జో బైడెన్ ఈ కీలక ప్రకటన చేశాడు. కానీ.. రష్యా భూభాగంపై ఆ ఆయుధాల్ని ప్రయోగించడానికి వీల్లేదు. ఉక్రెయిన్ తనని తాను కాపాడుకోవడం కోసం రష్యా దాడుల్ని తిప్పికొట్టడానికి వాటిని వినియోగించేలా ఒప్పందం కుదుర్చుకుంది.

‘‘ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దండయాత్ర ‘దౌత్యం’ ద్వారా ముగుస్తుందని మేము భావిస్తున్నాం. అయితే.. చర్చల పట్టికలో ఉక్రెయిన్‌కు అత్యధిక పరపతిని అందించడానికే గణనీయమైన ఆయుధ సంపత్తిని, మందుగుండు సామగ్రిని అందించబోతున్నాం’’ అని అధ్యక్షుడు బైడెన్ అన్నారు. సుమారు 700 మిలియన్‌ డాలర్ల ఆయుధ ప్యాకేజీలో భాగంగా ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఈ రాకెట్లు దాదాపు 80 కిలోమీటర్ల రేంజ్‌లోని లక్ష్యాలను నాశనం చేస్తాయి.

రష్యా భూభాగంలో వీటిని ప్రయోగించమని ఉక్రెయిన్‌ నుంచి హామీ తీసుకున్న తర్వాతే.. ఈ సాయానికి అమెరికా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఉక్రెయిన్ యుద్ధభూమిలో కీలక లక్ష్యాలను చేధించడానికి వీలు కల్పించే మరింత అధునాతన రాకెట్ వ్యవస్థలు, ఆయుధ సామాగ్రిని మేము ఉక్రేనియన్లకు అందించాలని నిర్ణయించుకున్నట్టు బైడెన్ తెలిపారు.

Exit mobile version