Site icon NTV Telugu

JD Vance: ఇస్లామాబాద్‌లో వింత మర్యాద.. చిన్నారితో జేడీ వాన్స్‌కు స్వాగతం

Jdvance71

Jdvance71

ఇరాన్‌తో శాంతి చర్చల కోసం జేడీ వాన్స్ బృందం కొద్దిసేపటి క్రితమే ఇస్లామాబాద్ చేరుకుంది. నూర్‌ఖాన్ ఎయిర్‌పోర్టులో అమెరికా విమానం ల్యాండ్ అయింది. విమానంలోంచి జేడీ వాన్స్ కిందకు దిగగానే ఒక చిన్నారితో స్వాగతం పలికారు. జేడీ వాన్స్ కిందకు వంగి చిన్నారి దగ్గర నుంచి బొకే తీసుకున్నారు. పక్కనే ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇక ఇరాన్ బృందం అర్ధరాత్రి నూర్‌ఖాన్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అప్పుడు అసిమ్ మునీర్, అధికారులు స్వాగతం పలికారు. కానీ జేడీ వాన్స్ విషయంలో మాత్రం ప్రత్యేకంగా చిన్నారిని ముందు పెట్టి స్వాగతం పలికించారు. ఇప్పటికే ఇరాన్ 168 మంది పాఠశాల చిన్నారుల మృతికి నిరసనగా ఖాళీ విమానాన్ని తీసుకొచ్చింది. విమాన సీట్లలో చిన్నారుల బ్యాగ్‌లు, ఫొటోలు, రక్తంతో తడిసిన దుస్తులు కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇరాన్ సోషల్ మీడియాలో పంచుకుంది. ‘మినాబ్-168’ అంటూ పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా జేడీ వాన్స్‌కు చిన్నారితో స్వాగతం పలికించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేదంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందో తెలియడం లేదు. వాస్తవంగా ఫ్రొటోకాల్ మర్యాద ప్రకారం ప్రభుత్వ పెద్దలు స్వాగతం పలకాల్సి ఉంటుంది. జేడీ వాన్స్ ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

ఇదిలా ఉంటే తొలుత రెండు దేశాల బృందాల మధ్య పరోక్ష చర్చలు జరగనున్నాయి. అనంతరం రాత్రికి ప్రత్యక్ష చర్చలు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇరు పక్షాలకు మధ్యవర్తిగా పాకిస్థాన్ వ్యవహరిస్తోంది. అయితే ఈ చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇస్లామాబాద్ వేదికగా అంతర్జాతీయ మీడియా ప్రధానంగా ఫోకస్ చేస్తోంది.

 

Exit mobile version