అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా వాన్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మొదటి సారి తన తల్లికి ఉషాను పరిచయం చేసినప్పుడు ఆమె అడిగిన ప్రశ్నను పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ఉషా భారతీయురాలు అని చెప్పగానే.. వెంటనే ఆమె ఏ తెగకు చెందినది? అని మా అమ్మ అడిగిందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. అయితే తన తల్లి ఉద్దేశం ఎలాంటి అవమానకర భావన కాదని.. ప్రపంచంలోని వివిధ సంస్కృతుల గురించి అప్పట్లో పెద్దగా అవగాహన లేకపోవడం వల్లే ఆ ప్రశ్న వచ్చిందని వాన్స్ స్పష్టం చేశారు.
ఉషా వాన్స్ అమెరికాలోని కాలిఫోర్నియాలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఉషా భారతీయ మూలాలు కలిగిన కుటుంబంలో పెరిగినప్పటికీ…అమెరికాలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అయితే అమెరికాలో ‘‘ఇండియన్” అనే పదానికి రెండు అర్థాలు ఉండటం కూడా ఈ అపార్థానికి కారణమై ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు భారతదేశానికి చెందిన వారిని ఇండియన్లు అని పిలుస్తారు. మరోవైపు అమెరికా స్థానిక ఆదివాసీ సముదాయాలను కూడా చారిత్రకంగా “ఇండియన్లు” అని వ్యవహరించే సందర్భాలు ఉన్నాయి. అందువల్ల జేడీ వాన్స్ తల్లి తొలుత స్థానిక అమెరికన్ తెగలకు చెందిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నారని భావించి ఉండవచ్చని అంటున్నారు.
సోషల్ మీడియాలో కొందరు ఈ వ్యాఖ్యను అజ్ఞానానికి నిదర్శనంగా విమర్శించగా.. మరికొందరు వాన్స్ తన కుటుంబ నేపథ్యాన్ని నిజాయితీగా వివరించారని అభిప్రాయపడ్డారు. అయితే వాన్స్ మాత్రం కాలక్రమేణా తన తల్లి, కుటుంబ సభ్యులు ఉషాను పూర్తిగా స్వీకరించారని చెప్పారు. ఈ సందర్భంగా తన దివంగత అమ్మమ్మ ‘మామా’ గురించి కూడా వాన్స్ ప్రస్తావించారు. “నా జీవితంలో ఉన్న అతిపెద్ద విచారం ఏమిటంటే.. నా అమ్మమ్మకు ఉషాను కలిసే అవకాశం రాలేదు. ఇద్దరిలో చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ చాలా తెలివైనవారు. కానీ పూర్తిగా భిన్నమైన ప్రపంచాల నుంచి వచ్చారు” అని తెలిపారు.
జేడీ వాన్స్, ఉషా వాన్స్ 2010లో యేల్ లా స్కూల్‌లో చదువుతున్న సమయంలో పరిచయం అయ్యారు. నాలుగేళ్ల తర్వాత 2014లో హిందూ సంప్రదాయాలు, క్రైస్తవ ఆచారాలతో కూడిన వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. త్వరలో నాల్గో బిడ్డకు ఉషా వాన్స్ జన్మనివ్వనున్నారు. ఉషాలో తనను మొదట ఆకర్షించిన అంశం ఆమె నేరుగా మాట్లాడే స్వభావమని వాన్స్ పేర్కొన్నారు. “ఉషా మనసులో ఉన్నదాన్ని నేరుగా చెప్పేస్తుంది. అది కొన్నిసార్లు ఎదుటివారికి నచ్చకపోయినా.. ఆమె నిజాయితీగా మాట్లాడుతుంది. అదే నన్ను మొదట ఆకర్షించింది” అని జేడీ వాన్స్ చెప్పారు.
అయితే గతేడాది ఎరికా కిర్క్ నిర్వహించి యూఎస్ టర్నింగ్ పాయింట్ కార్యక్రమంలో ఉషా వాన్స్ గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఎప్పుడో ఒకరోజు ఉషా క్రైస్తవ మతంలోకి మారుతుందని ఆశిస్తున్నాను” అని వ్యాఖ్యానించగా వివాదం చెలరేగింది. అనంతరం ఉషా స్పందిస్తూ, “నేను హిందూ మతాన్ని ఆచరిస్తున్నాను. ప్రస్తుతం మత మార్పిడి చేసుకునే ఉద్దేశం లేదు” అని స్పష్టం చేశారు.

