Earthquake: జపాన్ దక్షిణ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది. క్యూషులోని కుమమోటో ప్రిఫెక్చర్‌లో మంగళవారం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం కారణంగా పలువరు గాయపడగా, ఒక భవనం కూలిపోయినట్లు ప్రధాని సనాయే తకైచి తెలిపారు.
భూకంపం తర్వాత జపాన్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఒక మీటర్ ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఒక మీటర్ వరకు అలలు నమోదైనట్లు తెలుస్తోంది. నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని, సహాయక చర్యల్లో ప్రాణ రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. అణు విద్యుత్ కేంద్రంపై ఎలాంటి ప్రభావం లేదని జపాన్ అణు నియంత్రణ సంస్థ తెలిపింది. కుమమోటోతో పాటు నాగసాకి, కగోషిమా, ఫుకుఓకా, సాగ, ఓయిటా, మియాజాకి ప్రిఫెక్చర్‌లకు అత్యవసర భూకంప హెచ్చరికలు జారీ చేశారు.
అంతకుముందు, జూన్ 25న ఉత్తర జపాన్‌లో 7.2 తీవ్రతతో భూకంప వచ్చింది. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశంగా జపాన్‌కు పేరుంది. ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత యాక్టివ్‌గా ఉండే ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’లో ఉంది. ఈ ప్రాంతంలో భూమి అడుగున నాలుగు ప్రధాన టెక్టానిక్ ప్లేట్లు కలుస్తున్నాయి. దీంతో ప్రతీ ఏడాది వందల సంఖ్యలో భూకంపాలు వస్తుంటాయి. 2011లో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా భారీ సునామీ వచ్చింది. దీని కారణంగా 18,500 మంది మరణించారు. ఇదే సమయంలో ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం తీవ్రంగా దెబ్బతింది.

