NTV Telugu Site icon

Volodymyr Zelensky: ఇదే సమయం.. మమ్మల్ని కూడా “నాటో”లో చేర్చుకోండి…

Zelensky

Zelensky

Volodymyr Zelensky: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో అంతం అయ్యేలా కనిపించడం లేదు. రష్యా నెమ్మనెమ్మదిగా ఉక్రెయిన్ పై పట్టు సాధిస్తోంది. ఇప్పటికే అత్యంత కీలకం అయిన బఖ్ మూత్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే 70 శాతం ప్రాంతాన్ని రష్యా నియంత్రణలోకి తీసుకుంది. దీంతో పాటు మూడు వైపుల నుంచి భారీగా దాడులు చేస్తోంది. ఇటీవల రష్యా జరిపిన దాడుల్లో ఏకంగా 400 మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి బఖ్ మూత్ సొంతం అయితే ఇక ఉక్రెయిన్ లోని అన్ని ప్రాంతాలకు రష్యాకు హైవే ఏర్పడినట్లు అవుతుంది.

Read Also: Rajnath Singh: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి కరోనా

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్స్కీ తమను నాటోలో చేర్చుకోవాలని కోరుతున్నారు. నాటో చేర్చుకోవడానికి ఇదే సమయం అని ఆయన అన్నారు. నాటో దేశాలకు చెందిన మెజారిటీ ప్రజలు, ఉక్రెయిన్ లోని ప్రజలు ఉక్రెయిన్ నాటోలో చేరేందుకు మద్దతు ఇస్తున్నారని, ఇలాంటి సమయంలోనే తగిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. నాటో చీఫ్ జెన్స్ స్టోలెన్ బర్గ్ సమావేశం అయిన సందర్భంలో జెలన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఫిన్లాండ్ నాటోలో సభ్యదేశంగా చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెలన్స్కీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఏడాది గడిచినా ఈ రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడటం లేదు. ముఖ్యంగా ఉక్రెయిన్ నాటో వైపు మొగ్గు చూపుతోందనే పుతిన్ ఆ దేశంపై దాడిని ప్రారంభించారు. ఉక్రెయిన్ కు నాటోలో సభ్యత్వం రష్యా భద్రతకు ప్రమాదమని పుతిన్ భావించాడు. ఒకవేళ ఉక్రెయిన్ కానీ నాటో సభ్యత్వం పొందేందుకు మరింత ప్రయత్నిస్తే, ఆ దేశంపై రష్యా మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ భూభాగాలు అయిన క్రిమియా, జపొరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. రష్యాకు చెందిన ప్రజలు నివసించే ఉక్రెయిన్ లోని భూభాగాలు పూర్తిగా స్వాధీనం చేసుకునే వరకు ఈ యుద్ధానికి ముగింపుకు వచ్చే అవకాశం లేదు.