Site icon NTV Telugu

Israel-Hamas: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ భీకరదాడులు.. నేలమట్టమైన భారీ భవంతులు

Hamas

Hamas

ఇజ్రాయెల్ మరోసారి విజృంభించింది. గాజాపై బాంబులతో విరుచుకుపడింది. గాజా నగరంపై టెల్‌ అవీవ్‌ దళాలు ముప్పేట దాడి చేశాయి. హమాస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి. దీంతో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. నగరానికి మూడువైపుల నుంచి బాంబు దాడులు.. మరోవైపు సముద్రం.. ఈ భయానక పరిస్థితుల్లో ఎటువైపు వెళ్లాలో తెలియక స్థానికులంతా రోడ్లపై పరుగులు తీశారు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేసి.. రోడ్ల పక్కనే నిద్రించారు. అక్టోబర్‌ 7 తర్వాత ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో ఇదే అతి పెద్ద దాడిగా తెలుస్తోంది. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణకు ఖతార్‌, అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న వేళ.. ఇంత భారీ స్థాయిలో టెల్‌ అవీవ్‌ సేనలు విరుచుకుపడటం భయాందోళన కలిగిస్తోంది.

ఇది కూడా చదవండి: Highest Grossing movies: అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్ 9 సినిమాలు ఇవే…

తాజా దాడులపై గాజా సివిల్‌ ఎమర్జెన్సీ సర్వీస్‌ స్పందించింది. ఇజ్రాయెల్‌ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. గాజా తూర్పు ప్రాంతంలోని దరాజ్‌, టఫాతో పాటు పశ్చిమ దిక్కున ఉన్న టెల్‌-అల్‌-హవా, సర్బా, రిమాల్‌ ప్రాంతాల్లో కాల్పుల తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది. పక్కా ప్రణాళిక ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గాజా నగరంపై బాంబుల వర్షం కురిపించాయి. మూడువైపుల నుంచి ఒకేసారి దాడులు జరగడంతో ప్రాణభయంతో వేలాది మంది ప్రజలు మధ్యధరా సముద్రతీరం వైపు పరుగులు తీశారు. తెల్లవారు జాము వరకు కాల్పులు కొనసాగాయి. హమాస్‌ ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఆపరేషన్‌ చేపట్టినట్లు ఇజ్రాయెల్‌ మిలటరీ ప్రకటించింది. తమ బలగాలకు ముప్పు తలపెట్టే అవకాశమున్న 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: GOAT: భలే ఛాన్స్ పట్టేసిన మైత్రి మూవీ మేకర్స్

ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య సంధి కుదిర్చేందుకు అమెరికా ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనికి హమాస్‌ అంగీకరించడంతో గాజాలోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై కాల్పులు ఉండబోవని ఆనందపడ్డారు. ఈ అంశంపై ఇజ్రాయెల్‌ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేయడంతో ఒప్పందం ఖరారవుతుందని అంతా భావించారు. కానీ హమాస్‌ ఇక్కడే మెలిక పెట్టింది. ఒప్పందం సంతకం చేసే ముందు ఇజ్రాయెల్‌ పూర్తిగా కాల్పులను విరమించాలని షరతు విధించింది. దీనికి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు నిరాకరించారు. ఏ ఒప్పందమైనా ఇజ్రాయెల్‌ యుద్ధ లక్ష్యాలను నిరోధించేలా ఉండకూడదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: CPI Narayana: రాజకీయాల్లో వైఎస్ విలక్షణమైన వ్యక్తి..

Exit mobile version