NTV Telugu Site icon

Israel-Hamas War: గాజా ఆస్పత్రుల కిందే హమాస్ నెట్‌వర్క్.. బందీలు కూడా అక్కడే..

Israel Hamas War

Israel Hamas War

Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై దాడి చేశారు. ఈ దాడిలో 1400 మంది ఊచకోత కోశారు, మరో 200 మంది వరకు ప్రజల్ని బందీలుగా చేసుకుని గాజా ప్రాంతంలోకి తరలించారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాస్ట్రిప్ పై తీవ్రంగా దాడులు చేస్తోంది. హమాస్‌ని నేలకూల్చే వరకు విశ్రమించేంది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. హమాస్ ఉగ్రస్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. ప్రస్తుతం గాజాలో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) భూతల దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ దాడుల్లో 11 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు.

Read Also: Amazon: అమెజాన్‌లో మరోసారి లేఆఫ్.. ఈ సారి ఎంత మంది అంటే..

ఇదిలా ఉంటే గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్ సైన్యం టార్గెట్ చేస్తోంది. ఈ ఆస్పత్రిని హమాస్ తన కమాండ్ సెంటర్‌గా మార్చుకోవడంతో పాటు ఇజ్రాయిల్ బందీలను ఇక్కడే ఉంచిందని ఇజ్రాయిల్ సైన్యం చెబుతోంది. గాజాలోని పిల్లల ఆస్పత్రి కింద నేలమాళిగలో హమాస్ నిల్వ చేసిన ఆయుధాలను ఇజ్రాయిల్ మిలిటరీ షేర్ చేసింది. గాజాలోని ప్రముఖ క్యాన్సర్ ఆస్పత్రి, పీడియాట్రిక్ ఆస్పత్రి అయిన రాంటిస్సీ హాస్పిటన్ బేస్మెంట్‌లో హమాస్ ఉగ్రవాదులు భద్రపరిచిన గ్రెనేడ్స్, సూసైడ్ వెస్ట్‌లు, ఇతర పేలుడు పదార్థాలతో సహా కమాండ్ సెంటర్‌ని కనుగొన్నట్లు ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి రియల్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. దీంతో పాటు బెస్‌మెంట్‌లో హమాస్ భూగర్భ సొరంగాలకు సంబంధించిన షాఫ్ట్‌‌తో సహా నివాస గృహాలకు సంబంధించిన ఫోటోలను ఇజ్రాయిల్ సైన్యం వెలుగులోకి తెచ్చింది.

ముఖ్యంగా గాజాలోని అతిపెద్ద అస్పత్రి అల్ షిఫాను ఇజ్రాయిల్ టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే ఈ ఆస్పత్రిని చుట్టుముట్టింది. అయితే ఇందులోని రోగులను, ఆస్పత్రి సిబ్బందిని సురక్షితమైన దక్షిణ ప్రాంతానికి వెళ్లాలని ఇజ్రాయిల్ ఆర్మీ ఇప్పటికే హెచ్చరించింది. ఇదిలా ఉంటే హమాస్ ఉగ్రవాదులు మాత్రం రోగులను బందీలుగా ఉంచుకుని మానవ కవచాలుగా ఉంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఆస్పత్రి వ్యవస్థ దెబ్బతినడంతో కరెంట్, జనరేటర్ వంటి ప్రాథమిక సౌకర్యాలు దెబ్బతిన్నాయి. పసి పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారని, కొందరు చనిపోయారని హమాస్ ఆరోపించింది. అయితే పసిపిల్లలను సురక్షితంగా రక్షించేందుకు ఇజ్రాయిల్ సైన్యం సిద్ధంగా ఉందని రెండు రోజుల క్రితం వెల్లడించింది.

Show comments