Israel-Hamas War: ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు.. మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం

  • ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం
  • ప్రియురాలి సమాధి దగ్గర ఆత్మహత్య
  • మూడేళ్ల తర్వాత తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన
Israel

Israel

2023, అక్టోబర్ 7 అందరికీ గుర్తుండే తేదీ. ప్రపంచం కలవరపాటుకు గురైన రోజు. హమాస్ ఉగ్రవాదులు హఠాత్తుగా ఇజ్రాయెల్‌పై దండెత్తి కొందరు ప్రాణాలు తీయగా.. మరికొందరిని బందీలుగా తీసుకెళ్లి హింసకు గురి చేశారు. అనంతరం అంతర్జాతీయ ఒత్తిడితో కొందరిని సజీవంగా అప్పగించగా.. మరికొందరి శవాలు అప్పగించారు. అయితే తాజాగా మూడేళ్ల తర్వాత తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది.

హమాస్ జరిపిన దాడిలో ప్రియురాలిని కోల్పోయిన ఓ ఇజ్రాయెల్ యువకుడు.. దాదాపు మూడేళ్ల తర్వాత ఆమె సమాధి దగ్గరే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలి మరణం నుంచి ఇప్పటి వరకు కోలుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన అక్టోబర్ 7 దాడి బాధితులు, వారి కుటుంబాలపై ఇప్పటికీ కొనసాగుతున్న మానసిక ప్రభావాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.

ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం.. 30 ఏళ్ల బార్ అస్రాఫ్ వెస్ట్ బ్యాంక్‌లోని ఎల్కానా ప్రాంతంలోని ఓ శ్మశానవాటికలో ప్రియురాలు లిరోన్ బర్దా సమాధి పక్కన మృతదేహంగా కనిపించాడు. అతడి ఛాతీపై తుపాకీ గాయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న అత్యవసర సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ.. అతడిని కాపాడలేకపోయారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి సమయంలో జరిగిన నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై దాడిలో లిరోన్ బర్దా మృతి చెందింది. ఆ సమయంలో ఆమె ఫెస్టివల్‌లో బార్ మేనేజర్‌గా పనిచేస్తోంది.

కుటుంబ సభ్యుల వివాహ వేడుకలో పాల్గొన్న అస్రాఫ్.. ఎవరికి చెప్పకుండా అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయినట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. కొంతసేపటి తర్వాత అతడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. ఇజ్రాయెల్ మీడియా సంస్థ వాల్లాతో మాట్లాడిన అస్రాఫ్ సోదరి లేహి.. చివరకు లిరోన్ బర్దా సమాధి దగ్గర అతడి కోసం వెతకాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ‘‘మేం నా మరో సోదరుడి పెళ్లి వేడుకలో ఉన్నాం. ఆ సమయంలో అతడికి ఒంటరితనం అనిపించి ఉండొచ్చు. అందుకే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతడు ఎప్పటిలాగే ఒంటరిగా కూర్చుని ఆలోచించేందుకు వెళ్లాడని నేను భావించాను’’ అని ఆమె తెలిపారు. ‘‘ఒక గంట, రెండు గంటలు గడిచాయి. అప్పుడు మా పెద్ద సోదరి.. వెళ్లి అతడి కోసం వెతుకుదాం అని చెప్పింది. ముందుగా అతడు వెళ్లే అవకాశం ఉన్న ప్రదేశాల్లో వెతికాం. తర్వాత లిరోన్ సమాధి దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అతడు అక్కడికి వెళ్లి ఆమెతో మాట్లాడుతున్నట్లు భావించేవాడు. ఆమె సమాధి వద్ద కొంతసేపు ఉండటం అతడికి ఇష్టం’’ అని లేహి పేర్కొన్నారు.

సమాధి పక్కన అస్రాఫ్ పడుకుని ఉండటాన్ని చూసిన ఆమె.. అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడని తొలుత భావించినట్లు తెలిపారు. అతడిని లేవాలని పిలిచినా స్పందించకపోవడంతో దగ్గరకు వెళ్లారు. అప్పుడు అతడి శరీరం రక్తంతో తడిసి ఉండటాన్ని, పక్కనే తుపాకీ ఉండటాన్ని గుర్తించారు. ఏం జరిగిందో తనకు వెంటనే అర్థమైందని లేహి చెప్పారు. తాను ఎంతో ప్రేమించిన మహిళ సమాధి పక్కనే తన సోదరుడు ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.

లిరోన్ బర్దా మృతి చెందిన రోజు నుంచి అస్రాఫ్ తీవ్ర విషాదంలో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరణం తర్వాత అతడి జీవితం పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. లిరోన్ తండ్రి అవి తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 7 దాడి జరిగిన ఉదయం ఆయన తన కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడారు. నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని ఆమెను కోరారు. అయితే గాయపడిన వారికి సహాయం చేయాలని భావించిన లిరోన్ అక్కడి నుంచి వెళ్లడానికి నిరాకరించినట్లు తెలిపారు. తన కుమార్తె స్వభావమే అలాంటిదని, సహాయం అవసరమైన వారిని వదిలి ఆమె వెళ్లిపోయి ఉంటే తనకు ఆశ్చర్యంగా ఉండేదని అవి గతంలో పేర్కొన్నారు.

అస్రాఫ్ తల్లి బ్రాచా వాల్లాతో మాట్లాడుతూ.. లిరోన్ మరణం తర్వాత తన కుమారుడి జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. దాడి జరిగిన తర్వాత మూడు రోజుల పాటు లిరోన్ బతికే ఉందా లేదా అనే విషయం ఆమె కుటుంబానికి తెలియలేదని తెలిపారు. ఆ కష్టకాలంలో అస్రాఫ్ నిరంతరం లిరోన్ కుటుంబ సభ్యులతోనే ఉన్నాడని గుర్తు చేసుకున్నారు. తర్వాతి సంవత్సరాల్లో కూడా అస్రాఫ్ తరచూ లిరోన్ కుటుంబాన్ని కలిసేవాడని చెప్పారు. లిరోన్ తల్లికి పూలు తీసుకెళ్లేవాడని, ఆమె జ్ఞాపకార్థం తన శరీరంపై టాటూ కూడా వేయించుకున్నాడని తెలిపారు.

మరణానికి కొద్దికాలం ముందు కూడా అస్రాఫ్ తనతో మాట్లాడాడని బ్రాచా చెప్పారు. లిరోన్‌ను ఇప్పటికీ తీవ్రంగా మిస్ అవుతున్నానని, ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, తన బాధను ఎవరూ తగ్గించలేరని తన కుమారుడు చెప్పినట్లు తెలిపారు. అస్రాఫ్ అంత్యక్రియలు ఆదివారం నహల్ రబ్బా శ్మశానవాటికలో నిర్వహించారు.

అస్రాఫ్ మరణంతో అక్టోబర్ 7 దాడి బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారిపై కొనసాగుతున్న దీర్ఘకాలిక మానసిక ప్రభావంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారు, తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిలో చాలా మంది ఇప్పటికీ తీవ్రమైన మానసిక వేదన, ఆందోళనతో బాధపడుతున్నారని మానసిక ఆరోగ్య సంస్థలు పలుమార్లు హెచ్చరించాయి. అక్టోబర్ 7 దాడి తర్వాతి నెలల్లో నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి ప్రాణాలతో బయటపడిన పలువురు ఆత్మహత్య చేసుకున్నట్లు 2024 ఏప్రిల్‌లో ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి. వారిలో 28 ఏళ్ల రోయి షలేవ్ కూడా ఉన్నాడు. గత ఏడాది అక్టోబర్‌లో అతడు తనను తాను నిప్పంటించుకుని ప్రాణాలు కోల్పోయాడు.

నోవా ఫెస్టివల్‌పై జరిగిన దాడి సమయంలో షలేవ్ తన ప్రియురాలు మాపల్ ఆడమ్, సన్నిహితురాలు హిలీ సోలమన్ మరణించడాన్ని కళ్లారా చూశాడు. అతడి వీపుపై కాల్పులు జరిగినప్పటికీ.. కొంతసేపు చనిపోయినట్లు నటిస్తూ అక్కడే ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. మరణానికి ముందు షలేవ్ ఒక సందేశం వదిలాడు. ‘‘నన్ను క్షమించండి. ఈ బాధను ఇక భరించలేకపోతున్నాను’’ అని అందులో పేర్కొన్నాడు.

మరో ఘటనలో.. నోవా ఫెస్టివల్ దాడిలో తన కుమారుడు స్లావాను కోల్పోయిన యెలెనా గిలర్ కూడా తీవ్ర మానసిక వేదనతో పోరాడారు. రెండేళ్ల పాటు మానసిక క్షోభను ఎదుర్కొన్న ఆమె 2025 అక్టోబర్‌లో ఆత్మహత్య చేసుకున్నట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు తెలిపాయి.

అక్టోబర్ 7 దాడి వల్ల ఏర్పడిన మానసిక గాయాలు ఇప్పటికీ అనేక మంది బాధితులు, వారి కుటుంబాలను ప్రభావితం చేస్తున్నాయని అధికారులు, మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషాద ఘటనల ప్రభావాన్ని ఎదుర్కోవడం ఇజ్రాయెల్‌కు దీర్ఘకాలిక సవాలుగా మారిందని పేర్కొంటున్నారు.