ఇజ్రాయెల్ నుంచి వియన్నా వెళ్తున్న విమానానికి బాంబ్ బెదిరింపు వచ్చింది. బాంబు బెదిరింపు సంకేతం రావడంతో టెల్ అవీవ్ నుంచి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు వెళ్తున్న ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని బల్గేరియాలోని సోఫియా విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. విమాన సిబ్బంది అప్రమత్తం చేయడంతో అధికారులు వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు. విమానంలో ఉన్న ప్రయాణికులను కిందకు దించి తనిఖీలు ప్రారంభించారు.
ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన OS82 విమానం ఎయిర్‌బస్ A320 రకానికి చెందినది. టెల్ అవీవ్ నుంచి వియన్నాకు ప్రయాణిస్తుండగా రొమేనియా సరిహద్దు సమీపంలో విమాన సిబ్బందికి బాంబు బెదిరింపునకు సంబంధించిన సంకేతం అందినట్లు బల్గేరియా రవాణా, సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యగా విమానాన్ని సోఫియాకు మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలని సిబ్బంది నిర్ణయించారు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్24 సమాచారం ప్రకారం.. విమానం రాత్రి 9.25 గంటలకు (UTC) సోఫియా విమానాశ్రయంలో దిగింది. ఈ విషయాన్ని స్కై న్యూస్ వెల్లడించింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం విమానంలో మొత్తం 57 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురు సిబ్బంది కాగా, 51 మంది ప్రయాణికులు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అధికారులు తదుపరి భద్రతా చర్యలపై దృష్టి సారించారు. బాంబు బెదిరింపు సమాచారం అందిన వెంటనే ప్రామాణిక భద్రతా విధానాలను అమలు చేశారు. బల్గేరియా వైమానిక దళానికి చెందిన ఓ యుద్ధ విమానం గాల్లోకి ఎగిరి, ప్రయాణికుల విమానానికి తోడుగా ప్రయాణించింది. అనంతరం విమానం సోఫియా విమానాశ్రయంలో సురక్షితంగా దిగే వరకు పర్యవేక్షించింది.
విమానం ల్యాండ్ అయిన తర్వాత అధికారులు ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సంబంధిత భద్రతా సంస్థలు విమానంలో తనిఖీలు ప్రారంభించాయి. ప్రయాణికులను విమానం నుంచి కిందకు దించారు. అయితే బాంబు బెదిరింపునకు సంబంధించిన అసలు వివరాలు ఏమిటి? విమానంలో ఏదైనా అనుమానాస్పద వస్తువు గుర్తించారా? అనే అంశాలపై అధికారులు ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం వెల్లడించలేదు. తనిఖీల్లో ఏం తేలిందన్నది తెలియాల్సి ఉంది.

