NTV Telugu Site icon

Israel-Hamas War: గాజా ఆస్పత్రిలో బందీలుగా ఉంచిన హమాస్ కమాండర్‌ని హతమార్చిన ఇజ్రాయిల్..

Hamas

Hamas

Hamas: గాజాపై ఇజ్రాయిల్ సైన్యం విరుచుకుపడుతోంది. ఇన్నాళ్లు ఆస్పత్రుల మాటున ఉన్న హమాస్ తీవ్రవాదుల్ని అంతం చేసేందుకు ముమ్మరదాడుల్ని నిర్వహిస్తోంది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. ఈ ఆస్పత్రిని హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్‌గా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఇక్కడి నుంచే హమాస్ టన్నెల్ వ్యవస్థ మొదలవుతోందని, ఆస్పత్రులను హమాస్ రక్షణగా ఉపయోగించుకుంటోదని తెలిపింది. ఈ నేపథ్యంలోనే అల్ షిఫా ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు ఐడీఎఫ్ సిద్ధమైంది.

గాజా ఆస్పత్రిలో 1000 మంది వ్యక్తుల్ని, రోగుల్ని బందీలుగా ఉంచుకుని, వారు తప్పించుకోకుండా ప్రయత్నించిన సీనియర్ హమాస్ కమాండర్‌ని వైమానిక దాడిలో చంపినట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. అహ్మద్ సియామ్ హమాస్‌కి చెందిన నాజర్ రద్వాన్ కంపెనీలో కమాండర్ అని.. ఉగ్రవాద దాడుల్లో పౌరులను మానవకవచాలుగా ఉపయోగించుకున్నారని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఎక్స్(ట్విట్టర్)లో వెల్లడించింది.

Read Also: Tollywood: సక్సెస్ ఫుల్ హీరోల భార్యలను చూశారా.. హీరోయిన్లను మించి ఉన్నారుగా

మరోవైపు అల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయిల్ దాడుల వల్ల పసిపిల్లలు, ఇతర రోగులు చనిపోతున్నారని హమాస్ నేతృత్వంలోని ఆరోగ్యశాఖ ఆరోపించింది. ఇద్దరు నవజాత శిశువులు మరణించినట్లు తెలిపింది. కరెంట్ సౌకర్యం లేకపోవడం వల్ల డజన్ల కొద్దీ పిల్లలు ప్రమాదంలో ఉన్నారని తెలిపింది. కాగా, తమ లక్ష్యం గాజాలో హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ అని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ అన్నారు. అతనిని చంపాలని పాలస్తీనియన్లకు పిలుపునిచ్చారు. అలా అయితే యుద్ధం ఆగిపోతుందని అన్నారు. తాము యాహ్యా సిన్వార్‌ని ఖచ్చితంగా హతమారుస్తామని అన్నారు. యూరప్‌తో పాటు అరబ్ దేశాలు కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని ఇజ్రాయిల్‌ని కోరుతున్నప్పటికీ.. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇందుకు తిరస్కరిస్తున్నారు. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో ఇజ్రాయిల్ పై విరుచుకుపడ్డారు. ఇజ్రాయిల్ భూభాగంలోకి వచ్చిన ఉగ్రవాదులు 1400 మందిని క్రూరంగా హతమార్చారు. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్, గాజా స్ట్రిప్ పై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 11 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు.