NTV Telugu Site icon

Israel: మరొక హిజ్బుల్లా కీలక నేతని ఖతం చేసిన ఇజ్రాయిల్..

Israel

Israel

Israel: ఇజ్రాయిల్ హిజ్బుల్లాను పూర్తిగా తుడిచివేయాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. లెబనాన్ దాని రాజధాని బీరూట్‌పై భీకర దాడులు చేస్తోంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని గత వారం బీరూట్‌లో వైమానిక దాడి చేసి హతం చేసింది. దీనికి ముందే ఆ సంస్థ ప్రధాన కమాండర్లను ఒక్కొక్కరిగా వేటాడి వెంటాడి చంపేసింది. దీంతో హిజ్బుల్లా మిలిటరీ చైన్‌ని దెబ్బతీసింది. ప్రస్తుతం వైమానిక దాడులో పాటు భూతల దాడులు చేస్తోంది. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్ స్థావరాలను ధ్వంసం చేస్తోంది.

Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోయిస్టుల హతం..

ఇదిలా ఉంటే, తాజాగా హిజ్బుల్లా కీలక నేత, దాని కమ్యూనికేషన్ నెట్‌వర్క్ అధిపతి మహ్మద్ రషీద్ సకాఫీని బీరూట్‌లో గురువారం జరిపిన దాడుల్లో హతం చేసినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) శుక్రవారం ప్రకటించింది. ఖచ్చితమైన ఇంటెలిన్స్ ఆధారిత దాడి జరిగినట్లు ఐడీఎఫ్ చెప్పింది. సకాఫీ ఒక సీనియర్ హిజ్బుల్లా తీవ్రవాదిగా, ఇతను 2000 నుంచి కమ్యూనికేషన్స్ విభాగానికి చీఫ్‌గా ఉన్నాడు. హిజ్బుల్లాకి చెందిన అన్ని యూనిట్ల మధ్య కమ్యూనికేషన్ సామర్థ్యం పెంచడానికి కీలక ప్రయత్నాలు చేశాడు.

దీనికి ముందు మరొక కీలక హిజ్బుల్లా నేత మహ్మద్ అనిసిని చంపినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. ఇతను గైడెడ్ మిస్సైల్స్ డెవలప్మెంట్‌లో పాల్గొంటున్నట్లు ఇజ్రాయిల్ తెలిపింది. అనిసి 15 ఏళ్ల క్రితం హిజ్బుల్లాలో చేరాడు. ఇదిలా ఉంటే, నస్రల్లా మరణం తర్వాత అతడి వారసుడిగా చెప్పబడుతున్న హషీమ్ సఫీద్దీన్ భూగర్భ బంకర్‌లో సమావేశానికి హాజరవుతున్న సమయంలో ఇజ్రాయిల్ గురువారం అర్థరాత్రి భారీ దాడి చేసిందని ది న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో తెలిపింది. ఈ దాడి నస్రల్లాని చంపిన దానికన్నా పెద్దదని, మృతుల సంఖ్య ఇంకా తెలియరాలేదని వెల్లడించింది.