NTV Telugu Site icon

Benjamin Netanyahu: ఇరాన్ దాడి సమయంలో బంకర్‌లోకి నెతన్యాహు పరుగులు.. నిజమెంత?

Benjaminnetanyahu

Benjaminnetanyahu

ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. దాదాపు 180 క్షిపణులను ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. అయితే కొన్నింటిని గగనతలంలోనే ఇజ్రాయెల్ పేల్చేసింది. మరికొన్ని ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలను ధ్వంసం చేశాయి. అయితే మంగళవారం దాడి సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమన్ నెతన్యాహు భయంతో బంకర్‌లోకి పరిగెడుతున్నారంటూ ఇరాన్ అనుకూల సోషల్ మీడియాలో వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది.

‘‘ఎవరైనా దయచేసి బెంజమిన్ నెతన్యాహుకు దాక్కోవడానికి స్థలం ఇవ్వండి. అన్నింటికంటే అతను బంకర్‌లో దాక్కుని తన ప్రాణాలను కాపాడుకుంటున్నాడు. అతను పారిపోయి దాక్కుంటున్నాడు. తన దేశస్థులను తమను తాము రక్షించుకోవడానికి వదిలివేసాడు.’’ అంటూ ఇరానీయులు ట్వీట్లతో ట్రోలింగ్ చేస్తున్నారు.

అయితే ఈ వీడియోపై కొన్ని సంస్థలు ఫ్యాక్ట్‌ చెకింగ్‌ చేయగా.. మూడేళ్ల క్రితం నాటి వీడియోగా తేలింది. 2021లో ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ భవనంలోని కారిడార్లలో ఆయన హడావుడిగా పరుగెడుతున్న దృశ్యాలు అవి. సమావేశంలో హాజరయ్యేందుకు ఆయన ఆ విధంగా వెళ్లినట్లుగా తేలింది. ఇందుకు సంబంధించి మూడేళ్ల క్రితం నాటి ఫేస్‌బుక్‌లో ఈ వీడియోలు ఉన్నాయి.

ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్ష దాడి చేయడం ఇది రెండో సారి. ఏప్రిల్‌లో ఇదే తరహామైన దాడి చేయడంతో మిత్ర రాజ్యాల సహకారంతో తిప్పికొట్టింది. మంగళవారం కూడా అదే తరహాలో ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. అయితే కొన్ని క్షిపణులు మాత్రం టెల్‌అవీవ్‌పై పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగనట్లుగా సమాచారం. ఇటీవల హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా, హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ అంతమొందించింది. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ దాడులకు దిగింది. అయితే ఇరాన్‌కు ఇజ్రాయెల్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ తర్వాత టార్గెట్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీనే అని తెలుస్తోంది. అంతేకాకుండా అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. భారత్‌లోని ఇజ్రాయెల్‌ దౌత్య ప్రతినిధి గయ్‌ నిర్‌ మాట్లాడుతూ… తాము టెహ్రాన్‌కు తగిన జవాబు ఇస్తామని తెలిపారు. ఇక వేళ ఇరాన్‌ పూర్తి స్థాయి యుద్ధం కోరుకుంటే భారీ తప్పుగా మిగులుతుందని చెప్పుకొచ్చారు.