NTV Telugu Site icon

Israel-Hamas War: హమాస్ తీవ్రవాదులను వేటాడేందుకు ఇజ్రాయిల్ స్పెషల్ యూనిట్..

Shin Bet

Shin Bet

Israel-Hamas War: అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు భయానక దాడికి పాల్పడ్డారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇజ్రాయిల్ లోని ప్రజలను ఊచకోత కోశారు. మొత్తం 1400 మంది వరకు ప్రజలు మరణించారు. ఇజ్రాయిల్ కనీవిని ఎరగని రీతిలో దాడి జరిగింది. దీంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయిల్ హమాస్ ఉగ్రవాద సంస్థను నేలమట్టం చేసేందుకు సిద్ధమైంది.

ఇప్పటికే గాజా ప్రాంతంలోని హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తోంది. ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానం వచ్చిన ఆ ప్రాంతాన్ని నామరూపాలే లేకుండా చేస్తోంది. ఇదిలా ఉంటే హమాస్ ఉగ్రవాదుల్ని వేటాడి నిర్మూలించేందుకు ఇజ్రాయిల్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ ఇంటర్నల్ సెక్యూరిటీ సర్వీస్ విభాగం అయిన షిన్ బెట్ యొక్క కొత్త యూనిట్ హమాస్ తీవ్రవాదులను హతమార్చేందుకు ఏర్పాటైంది.

Read Also: Nani 31 : నాని సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ను ఫిక్స్ చేసిన మేకర్స్..

ముఖ్యంగా హమాస్ ఎలైట్ గ్రూప్ అయిన నుఖ్బా ఫోర్సులోని సభ్యుల్ని ఇజ్రాయిల్ కొత్త యూనిట్ టార్గెట్ చేయనుంది. ఇప్పటికే ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లోకీలకమైన హమాస్ ఉగ్రవాదుల్ని చంపేసింది. ఇందులో నుఖ్బా ఫోర్సు యూనిట్ కంపెనీ కమాండర్ కూడా ఉన్నాడు.

ఇంటర్నల్ సెక్యూరిటీ సర్వీస్ షిన్ బెట్ యొక్క కొత్త యూనిట్‌కి ‘నిలి’ అనే పేరు పెట్టినట్లు జెరూసలేం పోస్టు వెల్లడించింది. హిబ్రూ భాషలో ‘నిలి’ అంటే ‘ఇజ్రాయిల్ యొక్క శాశ్వతత్వం ఎప్పుడూ అబద్దం చెప్పదు’ అని అర్థం. ఇజ్రాయిల్ పై అక్టోబర్ 7న దాడికి పాల్పడిన హమాస్ ఉగ్రవాదుల్ని వేటాడి, హతమార్చేందుకు ఈ యూనిట్ ఏర్పాటైంది.

ఒక్కొక్కరుగా హతం:

దాడికి పాల్పడిన నుఖ్బా పోర్సు కమాండర్ అలీ ఖాదీని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తుదముట్టించింది. ఆ తర్వాతి రోజే నిరిమ్ ప్రాంతంలో ఊచకోతకు నాయకత్వం వహించిన కీలక హమాస్ లీడర్ బిల్లాల్ అల్ కేద్రాను హతం చేసింది. అక్టోబర్ 17 గాజాలో జరిగిన ఇజ్రాయిల్ వైమానిక దాడిలో హమాస్ బ్రిగేడ్ అధిపతి అయిన అమాన్ నోఫాల్ ని ఐడీఎఫ్ చంపేసింది. ఆ తర్వాత హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియే కుటుంబం ఉంటున్న ఇంటిపై దాడి చేసి అతని సోదరుడు, మేనల్లుడితో కలిపి 14 మందిని హతమార్చింది ఇజ్రాయిల్.