NTV Telugu Site icon

Syria-Israel: సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. రెబల్స్ లక్ష్యంగా క్షిపణుల ప్రయోగం

Syriaisrael

Syriaisrael

సిరియాపై ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ వైమానిక దాడులు నిర్వహించింది. సిరియా అంతటా క్షిపణులు ప్రయోగించింది. దీంతో బాంబు దాడులతో సిరియా దద్దరిల్లింది. తాజాగా సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సిరియా అధ్యక్షుడు అసద్.. రష్యాకు పారిపోయారు. దీంతో రెబల్స్‌.. రాజధాని డమాస్కస్‌తో సహా సిరియా అంతటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ఆయుధ సంపత్తి.. రెబల్స్ చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా సాయంతో సిరియాపై ఐడీఎఫ్ దళాలు డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించింది.

రసాయన ఆయుధాలు కలిగిన పరిశోధనా కేంద్రంతో సహా మిలిటరీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని భారీగా వైమానిక దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అసద్ పాలనను కూలదోసిన తర్వాత ఆయుధాలు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించేందుకు ఈ దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. డమాస్కస్‌కు 25 కిలోమీటర్ల పరిధి వరకు వైమానిక దాడులకు పాల్పడినట్లు యూకేకు చెందిన సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యుమన్ రైట్స్‌ వెల్లడించింది. ఈ ఘటనలో క్షిపణి లాంచర్లు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దళాలు సిరియా వైపు దూసుకువస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే సిరియాపై ఇజ్రాయెల్ చేస్తు్న్న దాడులను ఈజిప్ట్, సౌదీ అరేబియా, తదితర దేశాలు ఖండించాయి. సిరియాలో నెలకొన్న అనిశ్చితిని ఆసరాగా చేసుకుని అక్కడి భూభాగాలను ఆక్రమిస్తూ ఇజ్రాయెల్‌ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాయి. అయితే ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకే దాడులు చేస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఇదిలా ఉంటే 1974లో సిరియాతో కాల్పుల విరమణ ఒప్పందంతో ఏర్పాటైన గోలన్‌ హైట్స్‌లో బఫర్‌ జోన్‌ను సైతం ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది.

ఇక సిరియాలో దాడులకు అమెరికా సమర్థించింది. సిరియాలో అధికార మార్పు కారణంగా పొరుగుదేశాలైన జోర్డాన్, లెబనాన్, ఇరాక్, ఇజ్రాయెల్‌కు ముప్పు పొంచి ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అందుకోసమే ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Anu Emmanuel: అను ఇమ్మాన్యుయేల్ ఎక్కడ..?