అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి యుద్ధం తీవ్రమవుతోంది. ఈ మధ్య కొంత కాలంగా స్తబ్దతగా ఉంది. పెద్దగా దాడులు జరగడం లేదు. దీంతో రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం దిశగా వెళ్తున్నాయని భావించారు. కానీ ఇంతలో ఏమైందో ఏమో గానీ తాజాగా మరోసారి పశ్చిమాసియాలో బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఇరాన్‌లోని కీలక చమురు కేంద్రం ఖర్గ్ ఐలాండ్ సమీపంలో శనివారం పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. అమెరికా దాడిలో ఓ చమురు ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్‌కు చెందిన నూర్‌న్యూస్ తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
ట్యాంకర్‌పై నాలుగు ప్రాజెక్టైల్స్‌తో దాడి?
ఇరాన్‌కు చెందిన మరో వార్తా సంస్థ కథనం ప్రకారం.. ట్యాంకర్‌లో సరుకును అన్‌లోడ్ చేస్తున్న సమయంలో దానిపై నాలుగు ప్రాజెక్టైల్స్ దూసుకొచ్చాయి. అయితే ఇరాన్ సెమీ అఫీషియల్ ఫార్స్ న్యూస్ మాత్రం పేలుడు శబ్దాలు వినిపించినప్పటికీ.. ఖర్గ్ ఐలాండ్ సమీపంలో పొగలు కనిపించలేదని తెలిపింది. అయితే ఈ మీడియా కథనాలను ఇరాన్ అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు.
ఖర్గ్ ఐలాండ్‌పై దాడులా?
తాజా ఘటన.. నెలలుగా కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఘర్షణలో మరో కీలక పరిణామంగా మారింది. ముఖ్యంగా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి చుట్టూ ఇటీవలి రోజుల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఆగస్టు 30న అమెరికా ఇరాన్ లక్ష్యాలపై మరో దఫా దాడులు చేసింది. హార్ముజ్ జలసంధికి సమీపంలోని లారక్ ఐలాండ్‌లో ఇరాన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా తెలిపింది. సముద్ర మార్గంలో గనులు అమర్చడం, నౌకాయానాన్ని బెదిరిస్తున్న ఇరాన్ బలగాలే తమ లక్ష్యాలని వాషింగ్టన్ పేర్కొంది. దీనికి ప్రతిగా ఇరాన్.. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసినట్లు సమాచారం.
సెప్టెంబర్ 1న అమెరికా మరోసారి ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాలపై భారీ దాడులు చేపట్టింది. ఇరాన్‌కు చెందిన వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, సముద్ర వనరులు, మైన్లు అమర్చే సామర్థ్యాలు, కమ్యూనికేషన్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సైన్యం వెల్లడించింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై, అమెరికా సైనికులపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ఇటీవల దాడులకు ప్రయత్నించిన నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.
తాజా పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 31న ఖర్గ్ ఐలాండ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖర్గ్ ఐలాండ్‌ను “పూర్తిగా ధ్వంసం చేస్తున్నాం” అనే అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో ఒక చిన్న సందేశాన్ని పోస్టు చేశారు. దానికి ఏఐ రూపొందించిన వీడియోను కూడా జత చేశారు. దీంతో అమెరికా దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. అనంతరం గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా, దాని మిత్రదేశాల స్థావరాలపై ఇరాన్ దాడులు చేపట్టినట్లు సమాచారం. బహ్రెయిన్, జోర్డాన్, ఇరాక్ ప్రాంతాల్లోని లక్ష్యాలు కూడా ఈ దాడుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
హార్ముజ్ జలసంధే ప్రధాన కేంద్రం
తాజా అమెరికా-ఇరాన్ ఘర్షణలో హార్ముజ్ జలసంధి ప్రధాన ఫ్లాష్‌పాయింట్‌గా మారింది. ఈ జలమార్గంలో నౌకాయానంపై ఇరాన్ ఆంక్షలు కొనసాగిస్తుండగా.. వ్యూహాత్మక మార్గంపై తమ నియంత్రణను సవాల్ చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం సాధారణంగా ఈ జలమార్గం గుండా రవాణా అవుతుంది.
ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం?
అమెరికా-ఇరాన్ ఘర్షణలు సముద్ర రవాణాపైనా ప్రభావం చూపుతున్నాయి. హార్ముజ్ జలసంధి సమీపంలో నౌకలపై దాడులు, పరస్పర కాల్పులు చోటుచేసుకోవడంతో షిప్పింగ్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినట్లు రాయిటర్స్ పేర్కొంది. అమెరికా దాడులు, ఇరాన్ ప్రతీకార చర్యలు మరింత తీవ్రమైతే.. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు పెరుగుతున్నాయి.

