అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరుగుతుందన్న తరుణంలో టెహ్రాన్ మళ్లీ కొత్త మెలిక పెట్టింది. హార్ముజ్‌పై నియంత్రణ, యురేనియం శుద్ధీకరణపై రాజీ పడబోమని స్పష్టం చేసింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. యురేనియంపై ఇరాన్ వెనక్కి తగ్గిందని.. ఈ వారాంతంలో యూరప్‌లో శాంతి ఒప్పందం జరుగుతుందని ట్రంప్ ప్రకటించారు. దీంతో ప్రపంచ దేశాలు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాయి. కానీ ఇంతలోనే ఇరాన్ యూటర్న్ తీసుకుంది. హార్ముజ్ జలసంధిపై నియంత్రణ, యురేనియం శుద్ధీకరణ హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత ఒప్పంద ముసాయిదా వివరాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో టెహ్రాన్ తన వైఖరిని మరోసారి వెల్లడించింది.
ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ (IRNA) కథనం ప్రకారం.. ప్రస్తుతం ఖరారవుతున్న ఒప్పంద ముసాయిదాలో హార్ముజ్ జలసంధి నిర్వహణ హక్కులను వదులుకునే అంశం లేదని స్పష్టం చేసింది. అలాగే అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందు ఉన్న పరిస్థితులను పునరుద్ధరించేలా ఎలాంటి నిబంధనలకూ ఇరాన్ అంగీకరించలేదని పేర్కొంది.
హార్ముజ్‌పై ఇరాన్‌దే తుది నిర్ణయం
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి భవిష్యత్ నిర్వహణపై ఇరాన్, ఒమాన్ కలిసి ప్రాంతీయ చర్చల ద్వారా నిర్ణయం తీసుకుంటాయని ఐఆర్‌ఎన్‌ఏ వెల్లడించింది. ‘‘హార్ముజ్ జలసంధి నిర్వహణను వదులుకునే అంశం ఈ ఒప్పందంలో లేదు. ఇది ప్రాంతీయ అంశం. ఇరాన్, ఒమాన్ సంయుక్త నిర్ణయాల ద్వారానే భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటారు’’ అని పేర్కొంది.
యురేనియం శుద్ధీకరణపై రాజీ లేదు
అణు కార్యక్రమానికి సంబంధించి కూడా ఇరాన్ కఠిన వైఖరి కొనసాగిస్తోంది. యురేనియం శుద్ధీకరణ (Uranium Enrichment) హక్కు, ఇప్పటికే శుద్ధీకరించిన యురేనియం నిల్వలను కొనసాగించే హక్కును వదులుకోబోదని స్పష్టం చేసింది. ‘‘ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రాథమిక సూత్రాల పరిధిలోనే అణు చర్చలు జరుగుతాయి. యురేనియం శుద్ధీకరణ హక్కు, శుద్ధీకరించిన పదార్థాల నిల్వలు తుది ఒప్పందంలో తప్పనిసరిగా ఉండే అంశాలు’’ అని ఐఆర్‌ఎన్‌ఏ పేర్కొంది.
60 రోజుల చర్చల ప్రతిపాదన
ఇరాన్‌కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. అమెరికాతో చర్చిస్తున్న ముసాయిదా ఒప్పందంలో 60 రోజుల ప్రత్యేక చర్చల వ్యవధి ప్రతిపాదించారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలికేలా ముసాయిదా ఒప్పందంలో శాశ్వత కాల్పుల విరమణ అంశం కూడా ఉన్నట్లు మెహర్ వెల్లడించింది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అమెరికా, ఇరాన్ ఒప్పందానికి ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత దగ్గరగా వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో ఫ్రాన్స్‌లో జరిగే జీ7 సదస్సుకు ముందు హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఆంక్షల సడలింపు, 60 రోజుల కాల్పుల విరమణ వంటి అంశాలపై అవగాహన కుదిరే అవకాశం ఉందని దౌత్య వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇరాన్ మాత్రం ఇంకా తుది ఆమోదం ఇవ్వలేదని స్పష్టం చేసింది. దేశ అత్యున్నత నాయకత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతే అధికారిక ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

