Iran: అమెరికా, వెస్ట్రన్ దేశాలకు మరోసారి ఇరాన్ షాక్ ఇచ్చింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పరిశోధన శాటిలైట్‌ని ప్రయోగించిన వారం రోజుల తర్వాత.. మూడు ఉపగ్రహాలను ఏకకాలంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇరాన్ ఆదివారం తెలిపింది. ‘‘ ఇరాన్ మూడు శాటిలైట్లను మొదటిసారిగా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు’’ అని ఆ దేశ మీడియా వెల్లడించింది. శాటిలైట్లను టూ-స్టేజ్ సీమోర్గ్(ఫీనిక్స్) ఉపగ్రహ వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ఈ ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల కనిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు తెలిపింది.
Read Also: Prashant Kishore: ‘‘ఇది మూన్నాళ్ల ముచ్చటే’’.. బీహార్ రాజకీయాలపై ఎన్నికల వ్యూహకర్త పీకే సంచలనం..
32 కిలోల బరువున్న మహ్దా ఉపగ్రహాన్ని ఇరాన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది. మిగిలిన రెండు కేహాన్ 2, హటేఫ్ ఒక్కొక్కటి 10 కిలోల కన్నా తక్కువ బరువు కలిగి ఉన్నాయి. స్పేస్ బేస్డ్ పొజిషనింగ్ టెక్నాలజీ, నారో బ్యాండ్ కమ్యూనికేషన్ పరీక్షించే లక్ష్యంతో ఇరాన్ ఈ ప్రయోగాలను చేపట్టింది. గత వారం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ రీసెర్చ్ శాటిలైట్ ‘సొరయా’ను అంతరిక్షంలోకి పంపింది.
బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఈ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించాయి. ఇలాంటి ప్రయోగాలకు దిగొద్దని అమెరికా, ఇరాన్‌ని హెచ్చరించింది. ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణుల కోసం ఇదే టెక్నాలజీని వాడొచ్చని పేర్చొంది. అయితే, ఇరాన్ మాత్రం తాము అణ్వాయుధాలను కోరడం లేదని, తమ దేశ పౌర, రక్షణ ప్రయోజనాల కోసం మాత్రమే అని చెప్పింది.
