Iran-Hormuz: హార్ముజ్‌పై ఇరాన్ పట్టు కోల్పోతోందా? కారణమిదేనా?

  • హార్ముజ్‌పై ఇరాన్ పట్టు కోల్పోతోందా?
  • షిప్పింగ్ డేటా గణాంకాలు వెల్లడి
  • ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం
Iran

Iran

హార్ముజ్ జలసంధి అనేది ఇరాన్‌కు ఆర్థికంగా మూలస్తంభం లాంటింది. అలాంటిది గత ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేసిన తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. క్రమక్రమంగా హార్ముజ్‌పై టెహ్రాన్ నియంత్రణ కోల్పోతున్నట్లుగా కనిపిస్తోంది. తాజా పరిస్థితులను చూస్తుంటే మరింత దిగజారిపోతున్నట్లుగా కనిపిస్తోంది.

ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం క్రమంగా తగ్గుతోందా? తాజా పరిణామాలు చూస్తే అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఇరాన్ హెచ్చరికలను పట్టించుకోకుండా పెద్ద సంఖ్యలో వాణిజ్య నౌకలు ఒమన్ తీరానికి ఆనుకుని ఉన్న ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. దీంతో నౌకల రాకపోకలను నియంత్రించే విషయంలో ఇరాన్ సామర్థ్యం కొంత మేర బలహీనపడినట్లు తెలుస్తోంది.

షిప్పింగ్ డేటా సంస్థ Kpler గణాంకాల ప్రకారం.. గత రెండు వారాల్లో హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్ మార్గాన్ని ఉపయోగించుకున్నాయి. ఒమన్ ఉత్తర తీరానికి సమీపంగా వెళ్లే ఈ మార్గానికి అంతర్జాతీయ ఏర్పాట్ల కింద అనుమతి ఉంది. అయితే ఈ మార్గాన్ని ఇరాన్ వ్యతిరేకిస్తోంది. నెల రోజుల క్రితం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అప్పుడు వాణిజ్య నౌకలు దాదాపుగా ఎవరూ ఒమన్ మార్గాన్ని ఉపయోగించలేదని Kpler డేటా చెబుతోంది. ఇప్పుడు మాత్రం ఈ మార్గంలో నౌకల రాకపోకలు భారీగా పెరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇరాన్ పట్టు సడలుతోందా?

అమెరికా నౌకాదళం రక్షణ కల్పిస్తుండటంతో ఇరాన్ హెచ్చరికలను పట్టించుకోకుండా నౌకలు ఒమన్ మార్గంలో ప్రయాణించేందుకు ముందుకు వస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. Kplerలో క్రూడ్ ఆయిల్ విశ్లేషణ విభాగం అధిపతి హోమయూన్ ఫలక్‌షాహి ప్రకారం.. ‘‘ఇరాన్ హార్ముజ్ జలసంధిపై కనీసం కొంత మేర నియంత్రణ కోల్పోయినట్లు కనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.

హార్ముజ్ ఎందుకంత కీలకం?

హార్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియన్ సముద్రంతో కలుపుతుంది. ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఇది ఒకటి. ప్రపంచ చమురు, సహజవాయువు సరఫరాలో గణనీయమైన భాగం ఈ జలసంధి మీదుగానే రవాణా అవుతుంది. ప్రస్తుత ఇరాన్ ఘర్షణలో హార్ముజ్‌పై నియంత్రణ కీలక అంశంగా మారింది. ఈ జలసంధిపై తమకు నియంత్రణ ఉందని టెహ్రాన్ పదేపదే చెబుతూ.. తమకు ఆమోదయోగ్యం కాని మార్గాలను ఉపయోగించవద్దని నౌకలను హెచ్చరిస్తోంది. అయితే ఒమన్ వైపు నుంచి ప్రయాణించేందుకు ప్రయత్నించిన డజన్ల కొద్దీ నౌకలపై ఇరాన్ దాడులు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ అమెరికా నౌకాదళం రక్షణపై ఆధారపడుతూ మరిన్ని నౌకలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.

ఇరాన్ ఆదాయంపైనా ప్రభావం

నౌకలు ఇరాన్ సూచించిన మార్గాన్ని కాకుండా ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఎంచుకోవడం వల్ల టెహ్రాన్‌కు మరో సమస్య ఎదురవుతోంది. నౌకల రాకపోకలపై టోల్ లేదా ట్రాన్సిట్ ఫీజులు వసూలు చేసే ఇరాన్ సామర్థ్యం తగ్గుతోంది. పికరింగ్ ఎనర్జీ పార్ట్‌నర్స్(Pickering Energy Partners) వ్యవస్థాపకుడు, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ డాన్ పికరింగ్ ప్రకారం.. షిప్పింగ్ కంపెనీలకు ఒమన్ మార్గమే ఆచరణాత్మకంగా మారుతోంది. ఇరాన్ విధించే టోల్ చెల్లించేందుకు మధ్యప్రాచ్యంలోని చాలా దేశాలు ఆసక్తి చూపడం లేదని, అందుకే ఒమన్ మార్గమే అత్యంత అనుకూలమైన ఎంపికగా మారిందని ఆయన పేర్కొన్నారు.

లెక్కలు కష్టమే

అయితే హార్ముజ్ మీదుగా చమురు రవాణా ఎంత జరుగుతోందో ఖచ్చితంగా అంచనా వేయడం అంత సులభం కాదు. ఇందుకు ప్రధాన కారణం ‘డార్క్ షిప్పింగ్’. కొన్ని ఆయిల్ ట్యాంకర్లు తమ ట్రాన్స్‌పాండర్లను ఆఫ్ చేసి ప్రయాణిస్తాయి. దీంతో సాధారణ షిప్పింగ్ ట్రాకింగ్ వ్యవస్థలకు వాటి కదలికలు కనిపించవు. కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లను హార్ముజ్ మీదుగా పంపించి.. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ప్రమాదకర ప్రాంతం దాటిన తర్వాత మరో నౌకకు చమురును బదిలీ చేస్తున్నట్లు లిపో ఆయిల్ అసోసియేట్స్ (Lipow Oil Associates) అధ్యక్షుడు ఆండీ లిపో తెలిపారు. కొన్ని నౌకలు వారాల తరబడి సాధారణ ట్రాకింగ్ వ్యవస్థలకు కనిపించకుండా ఉండిపోతాయని ఆయన చెప్పారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా కొన్ని నౌకలను గుర్తించగలిగినా.. వాటి కదలికలను పూర్తిగా పర్యవేక్షించడం కష్టమని తెలిపారు. అయితే హార్ముజ్ చుట్టుపక్కల అమెరికా నౌకాదళం భారీగా మోహరించి ఉండటంతో అమెరికా సైన్యానికి షిప్పింగ్ కార్యకలాపాలపై మరింత విస్తృత సమాచారం అందుబాటులో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ గత వారం మాట్లాడుతూ.. హార్ముజ్ మీదుగా జరుగుతున్న చమురు రవాణా, జలసంధిని తప్పించుకుని ఇతర మార్గాల్లో తరలిస్తున్న చమురును కలిపితే వారానికి సగటున రోజుకు సుమారు 1.5 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతోందని తెలిపారు. యుద్ధానికి ముందు ఈ విస్తృత మార్గం ద్వారా రోజుకు సుమారు 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా జరిగేదని అంచనా. దీంతో ప్రస్తుత రవాణా పూర్తిగా నిలిచిపోలేదని తెలుస్తోంది.

తాజా షిప్పింగ్ డేటా అమెరికా, ఇరాన్ చేస్తున్న పరస్పర విరుద్ధమైన వాదనలను మరింత సంక్లిష్టం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం హార్ముజ్ జలసంధిపై అమెరికాకు ‘‘పూర్తి నియంత్రణ’’ ఉందని ప్రకటించారు. ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ఈ వాదనను పలుమార్లు చేస్తున్నారు. అయితే ఇరాన్ దాడులు ఇంకా కొనసాగుతుండటం, యుద్ధానికి ముందు స్థాయితో పోలిస్తే చమురు రవాణా ఇంకా తక్కువగా ఉండటం చూస్తే.. అమెరికాకు కూడా జలసంధిపై సంపూర్ణ నియంత్రణ లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

అసలు పరిస్థితి ఏమిటంటే.. నౌకల రాకపోకలను తన ఇష్టానుసారం నియంత్రించే ఇరాన్ సామర్థ్యం తగ్గింది. అదే సమయంలో అమెరికా కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తిస్థాయి నియంత్రణ సాధించలేదు. డాన్ పికరింగ్ మాట్లాడుతూ.. ఇరాన్ లక్ష్యం పూర్తిగా నియంత్రణ సాధించడం కంటే నౌకలను భయపెట్టి నిరోధించడమే కావచ్చని అన్నారు. ఆ నిరోధక సామర్థ్యం ఇంకా కొంత మేర కొనసాగుతోందని పేర్కొన్నారు. అయితే ఒమన్ మార్గాన్ని పెద్ద సంఖ్యలో నౌకలు ఎంచుకుంటుండటం ఇరాన్ నిరోధక వ్యూహం ప్రభావం తగ్గుతున్న సంకేతంగా కనిపిస్తోంది.

రంగంలోకి ఒమన్.. ఇరాన్‌తో చర్చలు

ఇదిలా ఉంటే హార్ముజ్ మీదుగా నౌకల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడంపై ఒమన్, ఇరాన్ చర్చలు జరుపుతున్నాయి. ఈ చర్చల్లో అమెరికా భాగస్వామ్యం లేదు. ఈ చర్చలు విజయవంతమైతే వాణిజ్య నౌకలు హార్ముజ్ ద్వారా ఎలా ప్రయాణించాలనే దానిపై ప్రభావం పడే అవకాశం ఉంది. తద్వారా ఇరాన్ సైనిక ఒత్తిడి, అమెరికా నౌకాదళ రక్షణ మధ్య సమీకరణాలు కూడా మారవచ్చు. అయితే ట్రాన్స్‌పాండర్లు ఆఫ్ చేసి ప్రయాణించే నౌకలను ట్రాక్ చేయడం కష్టంగా ఉన్నందున హార్ముజ్‌కు సంబంధించిన ఒక్కో వాదనను పూర్తిగా నమ్మకూడదని ఆండీ లిపో హెచ్చరించారు. అయినప్పటికీ మొత్తం పరిస్థితిని చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ‘‘ఇరాన్ హార్ముజ్ జలసంధిపై కొంత మేర నియంత్రణ కోల్పోయింది’’ అని పేర్కొన్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే.. ఈ నియంత్రణ కోల్పోవడం శాశ్వతంగా మారుతుందా? లేక నౌకలను మళ్లీ నిరోధించే సామర్థ్యాన్ని ఇరాన్ తిరిగి సాధించి, ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మక జలమార్గాల్లో ఒకటైన హార్ముజ్‌పై తన ప్రభావాన్ని పునరుద్ధరించగలదా? అనేది సస్పెన్ష్‌గా ఉంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.