Site icon NTV Telugu

Hormuz: హార్ముజ్ దగ్గర ఉద్రిక్తత.. నౌకపై ఇరాన్ దాడులు

Hormuz

Hormuz

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొడిగించారు. కానీ హార్ముజ్‌పై దిగ్బంధం ఎత్తేయలేదు. దీంతో రెండు దేశాల మధ్య అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే హార్ముజ్‌లోని ఒక నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారని యూకే తెలిపింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొంది.

హార్ముజ్ జలసంధిపై తమ నియంత్రణను చట్టబద్ధంగా అమలు చేస్తున్నామని ఇరాన్ పేర్కొంది. అనుమతి లేకుండా దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన వారిపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ వాన్‌గార్డ్ టెక్ ప్రకారం.. దాడి జరిగిన నౌక లైబీరియా జెండాను ఎగురవేస్తోంది. అయితే హార్ముజ్‌లో ప్రయాణించడానికి అనుమతి ఉందని తెలిపింది. ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ మాత్రం.. ఆ నౌక ఇరాన్ సాయుధ దళాల హెచ్చరికలను విస్మరించిందని పేర్కొంది.

ఇరాన్‌తో ఏర్పడిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బుధవారంతో ముగుస్తుంది. అయితే గడువు ముగిసేలోపు శాంతి ఒప్పందం చేసుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని పదే పదే ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. కానీ అమెరికాతో చర్చలకు ఇరాన్ ససేమిరా అంది. బెదిరిస్తే చర్చలు జరపబోమని తేల్చి చెప్పింది. కానీ విచిత్రంగా 24 గంటల ముందే ఏకపక్షంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ పొడిగించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు పొడిగించినట్లు వెల్లడించారు. ఈ ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇరాన్ అడగకుండానే పొడిగించడమేంటి? అని ప్రపంచ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.

Exit mobile version