Site icon NTV Telugu

Iran: కాల్పుల విరమణ మరుసటి రోజే.. “ఇజ్రాయిల్ గూఢచారులను” ఉరితీసిన ఇరాన్..

Iran Israel

Iran Israel

Iran: 12 రోజులు పాటు ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో సంఘర్షణ నెలకొంది. ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇజ్రాయిల్, ఇరాన్ అణు కార్యక్రమాలపై దాడులు చేసింది. ఇరాన్ అణు శాస్త్రవేత్తల్ని, టాప్ మిలిటరీ జనరల్స్‌ని ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో హతమార్చింది. అయితే, దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయిల్‌పై వందలాది క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకోవడంతో మిడిల్ ఈస్ట్‌లో సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది.

Read Also: Pakistan: అభినందన్ వర్థమాన్‌ని పట్టుకున్న పాకిస్తాన్ మేజర్ హతం..

అయితే, ఈ ఘర్షణ తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్-ఇరాన్ రెండూ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. అయితే, ఈ ఒప్పందం కుదిరిన ఒక రోజు తర్వాత కీలక పరిణామాలు సంభవించాయి. ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్ కోసం గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను ఇరాన్ ఉరితీసింది. ఈ విషయాన్ని ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ వార్తా సంస్థ తెలిపింది. ఉరితీయబడిన ముగ్గురు వ్యక్తులు ఇజ్రాయిల్ మొసాద్ కు సహకరించినందుకు, పేరులేని వ్యక్తి హత్యకు ఉపయోగించిన పరికరాలను అక్రమంగా రవాణా చేసినందుకు దోషులుగా నిర్ధారించబడినట్లు మిజాన్ వెల్లడించింది.

మరోవైపు, ఇజ్రాయిల్‌తో సంబంధం ఉన్న 700 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య దశాబ్దాల కాలంగా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలోనే మొసాద్‌కి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ ఇరాన్ అనేక మందిని ఉరితీసింది. ఇదే సమయంలో, మొసాద్ ఇరాన్ లోని కీలక వ్యక్తుల్ని, శాస్త్రవేత్తల్ని అనేక ఆపరేషన్లలో ఎలిమినేట్ చేసింది.

Exit mobile version