Kuwait-Iran: కువైట్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి.. పశ్చిమాసియాలో టెన్షన్

  • కువైట్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి
  • తిప్పికొట్టిన కువైట్ రక్షణ దళాలు
  • పశ్చిమాసియాలో టెన్షన్
Iran

Iran

అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఆరోపించింది. బుధవారం రాత్రి కువైట్ లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని.. అలాగే హార్ముజ్ జలసంధి సమీపంలో ఐదు వన్‌వే అటాక్ డ్రోన్లను మోహరించిందని వెల్లడించింది.

సెంట్కామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మే 27 రాత్రి 10:17 గంటలకు ఇరాన్ నుంచి కువైట్ వైపు బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిందని.. అయితే కువైట్ రక్షణ దళాలు దానిని విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపింది.

×
×
Ad

అదే రోజు కొన్ని గంటల ముందు హార్ముజ్ జలసంధి పరిసరాల్లో అమెరికా, మిత్రదేశాల భద్రతకు ముప్పుగా మారేలా ఐదు వన్‌వే అటాక్ డ్రోన్లను ఇరాన్ ప్రయోగించినట్లు పేర్కొంది. వాటన్నింటినీ అమెరికా బలగాలు కూల్చివేశాయని వెల్లడించింది. అదనంగా ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ప్రాంతంలో ఉన్న గ్రౌండ్ కంట్రోల్ సైట్ దగ్గర మరో డ్రోన్ ప్రయోగాన్ని కూడా అమెరికా బలగాలు అడ్డుకున్నట్లు తెలిపింది.

“ఇరాన్ పాలకులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించారు. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా, భాగస్వామ్య దేశాలకు ముప్పుగా మారే చర్యలకు పాల్పడ్డారు” అని సెంట్కామ్ ఆరోపించింది. అమెరికా, ప్రాంతీయ భాగస్వామ్య దేశాల బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని.. ఇరాన్ దూకుడును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రకటనలో పేర్కొంది.

ఇక ఈ పరిణామాలు అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య చర్చల మధ్య చోటుచేసుకోవడం గమనార్హం. ఇరాన్ అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధిలో రాకపోకల భద్రత వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై ఇప్పటికే పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. తాజా దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించలేదని అమెరికా అధికారులు వెల్లడించారు.