US-Iran: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని చంపే ప్రయత్నం చేయబోమని ఇరాన్ గత నెలలో అమెరికాకు తెలియజేసినట్లు తెలుస్తోంది. అమెరికా అధికారులు ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్‌తో పంచుకన్నారు. అక్టోబర్ 14న ఇరాన్ ఈ మేరకు అమెరికకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ట్రంప్‌కి వ్యతిరేకంగా ఏదైనా బెదిరింపులు యూఎస్ జాతీయ భద్రతకు సంబంధించిన అత్యున్నత ఆందోళన అని బైడెన్ ప్రభుత్వం ఇరాన్‌కి స్పష్టం చేసిందని, అలాంటి ఏ చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని యూఎస్ అధికారులు తెలిపారు.
Read Also: PM Modi: జీ -20 సమ్మిట్ కోసం బయలుదేరిన ప్రధాని మోడీ..మూడు దేశాల్లో పర్యటన..
2020లో డ్రోన్ దాడికి ఆదేశాలు ఇవ్వడం ద్వారా ట్రంప్ నేరం చేశారని ఇరాన్ ఆరోపిస్తోంది. ట్రంప్ హయాంలో ఇరాన్ అత్యంత శక్తివంతమైన మిలిటరీ కమాండర్ జనరల్ ఖాసిమ్ సులేమాని చంపబడ్డాడు. అయితే, ఇరాన్ మాత్రం ట్రంప్‌ని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశం తమకు లేదని చెప్పినట్లు తెలుస్తోంది. బదులుగా ఇరాన్ చట్టపరమైన మార్గాల ద్వారా సులేమానీ హత్యకు న్యాయం కోరుతున్నట్లు పేర్కొంది.
అంతకుముందు, అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతోందని అమెరికన్ అధికారులు హెచ్చరించారు. అయితే, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ వాదనల్ని ఖండించింది. ఇదిలా ఉంటే, ఇటీవల ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్ ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అయిన అమీర్ సయీద్‌తో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ భేటీని పరిగణిస్తున్నారు.