డొమినికన్ రిపబ్లిక్‌లో మార్చి 6న తప్పిపోయిన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోనంకి (20) ఆచూకీ ఇంకా లభించలేదు. వారం గడుస్తు్న్నా ఎలాంటి పురోగతి లభించలేదు. అధికారులు.. హెలికాప్టర్లు, డ్రోన్లు, పడవలతో జల్లెడ పట్టినా ఎలాంటి క్లూ దొరకలేదు. అయితే తాజాగా పోలీసులు కీలక ప్రకటన చేశారు. విద్యార్థిని బీచ్‌లో ఈత కొడుతూ మునిగిపోయి ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే ఈ వాదనను సుదీక్ష తల్లిదండ్రులు తోసిపుచ్చుతున్నారు. తమ కుమార్తె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటే.. ఈపాటికి శవం బయటకు వచ్చేదని.. కానీ వారం అవుతున్నా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తమ కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని ఆరోపించారు.
అమెరికాకు చెందిన సుదీక్ష పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదువుతోంది. అయితే ఐదుగురు స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లింది. డొమినికన్ రిపబ్లిక్‌లోని పుంటా కానాలోని ఒక రిసార్ట్‌లో ఎంజాయ్ చేశారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో అతిగా మద్యం సేవించింది. అనంతరం ఉదయం 4 గంటల సమయంలో అక్కడే పరిచయం అయిన మగ టూరిస్ట్‌తో కలిసి బీచ్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆమె వెంట స్నేహితులు ఉన్నా.. కొద్దిసేపటికే వారంతా తిరిగొచ్చేశారు. కానీ సుదీక్ష.. మగ టూరిస్ట్ మాత్రం తిరిగి రాలేదు. అనంతరం స్నేహితులు వెళ్లి చూస్తే.. సుదీక్ష కనిపించలేదు. వారు అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. గాలింపు చేపట్టారు. అయితే ఆమెతో ఉన్న మగ టూరిస్ట్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తనకేమీ తెలియదని చెప్పుకొచ్చినట్లు సమాచారం.
వారం గడుస్తున్నా సుదీక్ష ఆచూకీ ఇంకా లభించకపోవడంతో యూఎస్ ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. కరేబియన్ అధికారులతో కలిసి గాలిస్తున్నారు.
సుదీక్ష.. అమెరికాలో విద్యను అభ్యసిస్తోంది. 2026లో పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలు కాబోతుంది. ఇక అంతకముందు వర్జీనియాలోని అలెగ్జాండ్రియాలోని థామస్ జెఫెర్సన్ హై స్కూల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంది. తన స్నేహితులతో కలిసి మార్చి 6న కరేబియన్ దేశానికి విహార యాత్రకు వెళ్లింది. బికినీ ధరించి బీచ్‌లో నడుస్తుండగా అదృశ్యమైంది. సుదీక్ష ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు. నల్లటి జుట్టు. గోధుమ రంగు కళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆమె అదృశ్యమైన సమయంలో గోధుమ రంగు బికినీ.. పెద్ద గుండ్రని చెవిపోగులు. కుడి కాలు మీద మెటల్ డిజైనర్ ఉంది. కుడి చేతిలో పసుపు మరియు స్టీల్ బ్రాస్‌లెట్‌లు. ఎడమ చేతిలో బహుళ వర్ణ పూసల బ్రాస్‌లెట్ ధరించి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.